బత్తలపల్లి: నిరుపేదలకు ఆర్టీటీ అందిస్తున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ అయిన తరువాత తొలిసారి ఆయన గురువారం రాత్రి బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను యువగళం పాదయాత్ర సందర్భంగా ఆర్డీటీ గురించి విన్నానని, ఆర్డీటీ చేపట్టిన కార్యక్రమాలను కళ్లారా చూశానన్నారు. దివ్యాంగులు, ఇతరులను ఆర్డీటీ ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతమన్నారు. ఇతర జిల్లాల్లోనూ ఆర్డీటీ సేవలు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకు ముందు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ వద్ద మంత్రి నివాళులర్పించారు. అనంతరం మంత్రి లోకేష్‌కు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అభినందలు తెలిపారు. ఆయన వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ బీకే పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, ఆర్డీటీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చొరవ తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు స్తంభించాయి కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో ‘అంతపెద్ద మాటలు వద్దులే గురువుగారు’ అంటూ మాట మార్చారు. ఇక ‘నీట్ పరీక్ష రద్దు’పై విలేకరులు ప్రశ్నించగా... ఇక్కడొద్దు అంటూ దాటవేశారు.


