సాక్షిప్రతినిధి, అనంతపురం : హనీట్రాప్ వ్యవహారంలో ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తీవ్ర చర్చ నడుస్తోంది. బాధితుల నుంచి నిందితులు ప్రామిసరీ నోటు బాండ్లు సేకరించిన తర్వాత పోలీసులతో చెప్పి నిందితులకు అనుకూలంగా పంచాయితీలు చేసిన వారిలో టీడీపీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పలు పత్రికలు, టీవీల్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ‘హనీట్రాప్ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం’ వివరాలు రాష్ట్రపార్టీకి చెప్పాలి కదా..’ అని సునీల్ ఆరా తీస్తే హనీట్రాప్ వ్యవహారంలో తనకు తెలిసిన అంశాలను సునీల్‌కు నాగరాజు వివరించారు. అలాగే తన అసంతృప్తిని కూడా వెళ్లగక్కారని తెలుస్తోంది.
కాలవతో పూల నాగరాజుకు ఇక్కట్లు..
రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు అదే నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజుకు మధ్య వైరం నడుస్తోంది. పూల నాగరాజు దుర్గానికి స్థానికుడు కావడంతో వాల్మీకి కోటాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ‘దుర్గం’ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. చివరకు కాలవ టిక్కెట్ దక్కించు కుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, ఎప్పటికై నా నాగరాజుతో ప్రమాదమని భావించి, పథకం ప్రకారం నాగరాజును అణగదొక్కే చర్యలను కాలవ ముమ్మరం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాలవ పూజలు నిర్వహించారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని పిలిపించారు. గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, సత్యకుమార్ విచ్చేశారు. వీరితో పాటు టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరిని కూడా ఆహ్వానించారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజును మాత్రం ఆహ్వానించలేదు. ‘దుర్గం’లో నిర్వహించిన కార్యక్రమానికి సాటి సామాజికవర్గం నేత, పైగా జిల్లా అధ్యక్షుడిని విస్మరించడం చూస్తే కావాలనే దూరం పెడుతున్నారనేది స్పష్టమవుతోంది.దీన్ని నాగరాజు కూడా తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్సార్‌సీపీ చేపట్టిన బీసీ గళం సదస్సు దిగ్విజయమైంది. ఈ క్రమంలో కాలవ, ఎంపీ బీకే ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీసీ అంశం మాట్లాడే క్రమంలో బీసీ నేతగా ఉన్న జిల్లా అధ్యక్షుడిని కాలవ ఆహ్వానించలేదు. అలాగే చాలా సందర్భాల్లో పార్టీ వ్యవహారాలపై ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కాలవ ప్రెస్‌మీట్ నిర్వహిస్తే, మళ్లీ అధ్యక్షుడిగా పార్టీ ఆఫీసులో నాగరాజు రెండోసారి అదే అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. ఇది వీరిమధ్య విభేదాలను స్పష్టం చేస్తోంది. చివరకు ఇద్దరూ రైలు ప్రయాణం చేసే సమయంలో కాలవ ఎదురుగా సీట్లో నాగరాజు కూర్చుంటే ‘ఇక్కడ వద్దు పక్కకు వెళ్లి కూర్చోపో’ అని చెప్పారంటే నాగరాజుపై ఏస్థాయిలో కాలవ విద్వేషం పెంచుకున్నారో స్పష్టం అవుతోంది. దీన్నిబట్టి జిల్లా అధ్యక్షుడిని కాలవ ఎలా అవమానిస్తున్నారో అర్థమవుతోంది. నాగరాజు, అంబికా, గుమ్మనూరుతో పాటు చాలామంది వాల్మీకి నేతలు కాలవ ధోరణిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మినహా వాల్మీకుల్లో ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగకూడదనే ధోరణిలో కాలవ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఒకే జిల్లాలో తనతో పాటు అంబికా, గుమ్మనూరు రూపంలో బలమైన పోటీ కూడా నెలకొంది. దీంతో తన రాజకీయ ప్రయాణానికి అడ్డు తొలగించుకునే క్రమంలోనే కాలవ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే ‘దుర్గం’లో అక్రమ మైనింగ్, ఇసుక, కల్తీకల్లు తదితర అంశాల్లో కాలవ శ్రీనివాసులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న వివరాలను కూడా కొందరు నేతలు సునీల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆ ముగ్గురు ఏకమయ్యారా..?
వాల్మీకి కార్డుతోనే కాలవ రాజకీయాల్లో చెలామణీ అవుతున్నారు. తమపై కాలవ అనుసరిస్తోన్న వైఖరితో గుమ్మనూరు జయరాం, అంబికా, నాగరాజు ఏకమైనట్లు తెలుస్తోంది. పైగా గుమ్మనూరు జయరాం కుమార్తెను పూల నాగరాజు కుమారుడికి ఇచ్చి వియ్యం కలుపుకుంటున్నారు. ఇలా బంధువులుగా మారి తర్వాత రాజకీయంగానూ ఏకం కానున్నారు. మరో వాల్మీకి నేత అంబికా వీరితోనే చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ముగ్గురు వాల్మీకి నేతలు ఏకమైతే పార్టీ అధిష్టానం వద్ద బలంగా తమ వాణీ విన్పించొచ్చని, తద్వారా కాలవకు చెక్ పెట్టొచ్చనేది వీరి భావనగా ఉన్నట్లు సమాచారం. టీడపీ కీలకంగా ఉన్న లోకేశ్‌తోనూ సన్నిహితంగా ఉంటూ కాలవ ఎత్తులకు పై ఎత్తులు వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా హనీట్రాప్ చిచ్చు టీడీపీలోని వర్గ విభేదాలను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లేలా చేసిన విషయం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంగా మారింది.
వాల్మీకీ నేతల మధ్య
తారస్థాయిలో విభేదాలు
జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును అవమానించేలా కాలవ ప్రవర్తన
అంబికా, గుమ్మనూరు, నాగరాజులను నిరోధించేలా చర్యలు
కాలవకు చెక్ పెట్టేందుకు
ఏకమైన ముగ్గురు వాల్మీకీ నేతలు
టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్
సునీల్‌కు ఫిర్యాదు


