● దర్యాప్తు కొనసాగుతోంది
● ఎస్పీ జగదీష్
అనంతపురం సెంట్రల్: హనీట్రాప్ కేసు క్లోజ్ అయ్యిందని, దర్యాప్తు మాత్రం కొనసాగుతోందని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని, తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అపోహలు సృష్టించే వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసులో ఏ–1 నిందితురాలికి చెందిన ఓ ప్లాటును సీజ్ చేసినట్లు తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
గంజాయి బ్యాచ్‌ను
గుర్తించేందుకు మెడికల్ కిట్లు..
గంజాయి వినియోగించే వారిని డ్రంకన్ డ్రైవ్ తరహాలో మెడికల్ టెస్ట్ కిట్ల ద్వారా గుర్తించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. నూతన సాంకేతికతతో గంజాయి సరఫరా మార్గాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తామన్నారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే 1972, 112 టోల్‌ఫ్రీకి సమాచారం ఇవ్వాలని కోరారు.
మామిడి టన్ను రూ.45 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో మంగళవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.45 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 344 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.45 వేలు, కనిష్టంగా రూ.25 వేలు, సరాసరిన రూ.33 వేల ప్రకారం ధర పలికిందన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.30 వేలు, సరాసరిన రూ.35 వేలు పలికిందని వివరించారు. అలాగే హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెల్లడించారు.
ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
విడపనకల్లు: అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌ను వైద్య ఆరోగ్య శాఖాధికారులు మంగళవారం సీజ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గడేకల్లు గ్రామంలో రెండు ఆర్‌ఎంపీ క్లినిక్‌లపై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా దస్తగిరి అనే ఆర్‌ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్‌ను సీజ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆర్‌ఎంపీ క్లినిక్ నిర్వహించడం చట్ట రీత్యా నేరమన్నారు. పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఆర్‌ఎంపీలు అనధికారికంగా క్లినిక్‌లు నిర్వహిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేశవరెడ్డి, కొట్టాలపల్లి పీహెచ్‌సీ డాక్టర్ సంజీవ్, ఆరోగ్య విస్తరణ అధికారి తిరుపాల్ నాయక్, మాస్ మీడియా అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్‌లో సత్తా
అనంతపురం: పాలిసెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాలో 9,070 మంది పరీక్షకు హాజరుకాగా.. 8,120 (89.53%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 87.67, బాలికలు 92.44% శాతంగా నమోదైంది. జిల్లా స్థాయిలో నున్నా కృష్ణ తనయ ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. రెండో స్థానంలో డి ప్రహాస్య, మూడో స్థానంలో ఎస్.ఎం. నయీం సాదియా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త సి. జయచంద్రా రెడ్డి అభినందించారు.


