●కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

●కల్యాణం.. కమనీయం

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

రాయదుర్గం: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశిష్ట సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించారు. పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీనివాసుడి కల్యాణం జరిపితే, ఆ బాలికకు సకల గుణ సంపన్నుడు భర్తగా వస్తాడని భక్తుల నమ్మకం. అందులో భాగంగా ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కానాహొసళ్లికి చెందిన అరవ నగేష్‌, పావని దంపతుల కుమార్తె పద్మావతిని వధువుగా నిర్ణయించారు. ముందుగా పట్టణంలోని అరవ తెగ కులదైవం భక్త మార్కండేయుని ఆలయం వద్ద వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహం ఎదుట కులపెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అభిజిత్‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడితో బాలిక మెడలో ఆమె తల్లి పావని చేత పసుపుతాడు కట్టించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా.. గోవింద నామస్మరణతో ఆలయాన్ని మార్మోగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంచి పెట్టడంతో పాటు అన్నదానం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్‌ గౌని ఉపేంద్ర రెడ్డి, బీఎన్‌టీ, కేకేటీ కుటుంబాల ఆధ్వర్యంలో 4,500 లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు.

● ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గురువారం (రేపు) ఉదయం 11 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు.

బాలికతో శాస్త్రోక్తంగా శ్రీవారి వివాహం

వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం

Advertisement
 
Advertisement
Advertisement