కిశోరి వికాసంతో ఉజ్వల భవిత | - | Sakshi
Sakshi News home page

కిశోరి వికాసంతో ఉజ్వల భవిత

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

కలెక్టర్‌ ఓ.ఆనంద్‌

గుత్తిలో శిక్షణ కార్యక్రమం పరిశీలన

గుత్తి రూరల్‌: కిశోరి వికాసం కార్యక్రమం మహిళలు, బాలికల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో ఉన్న హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న కిశోరి వికాసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ‘కిశోరి వికాసం’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను ఇతర బాలికలకు, తల్లిదండ్రులకు తెలియజేసి చైతన్యవంతుల్ని చేయాలన్నారు. అనంతరం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ ఎల్లమ్మ, డీసీపీఓ మంజునాథ్‌, తహసీల్దార్‌ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్‌నాయక్‌, కమిషనర్‌ జబ్బార్‌మియా, వైద్యాధికారిణి ఆసియా అంజుమ్‌, హాండ్స్‌ సీఈఓ నారాయణస్వామి, సూపర్‌ వైజర్లు రాజేశ్వరి, గౌరి, దస్తగిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

గుత్తిలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

గుత్తి: గుత్తిలో మంగళవారం కలెక్టర్‌ ఆనంద్‌ సుడిగాలి పర్యటన చేశారు. మొదట కోట ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న పునశ్చరణ తరగతులను పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. విద్యార్థులందరూ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని, మళ్లీ ఫెయిల్‌ అయితే బాధ్యత వహించాల్సి వస్తుందని టీచర్లను హెచ్చరించారు. అనంతరం స్థానికంగా ఓ ఇంటి వద్ద ఎన్యూమరేటర్లు చేస్తున్న జనగణనను పరిశీలించారు. బస్టాండ్‌ ఎదురుగా స్ట్రీట్‌ వెండర్స్‌తో మాట్లాడారు. లోన్లు బాగా వస్తున్నాయా అంటూ ఆరా తీశారు.అర్ధంతరంగా ఆగిపోయిన మెప్మా భవనాన్ని పూర్తి చేయించాలని ఆర్‌పీలు కోరగా.. సానుకూలంగా స్పందించారు. రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నూతన ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణ పనులనూ కలెక్టర్‌ పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement