అనంతపురం టౌన్: జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సరిపడా సిబ్బంది లేరు. 50 మంది దాకా సిబ్బంది కొరత ఉంది. ఈ క్రమంలో వినియోగదారులకు సకాలంలో సేవలు అందడం లేదు. స్థిరాస్తుల విక్రయాలు, కొనుగోలు సమయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాంటి రికార్డులను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొందేందుకు రోజులు కాదు నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
స్పందించండి సారూ..
గతంలో ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని మాన్యువల్ ఈసీ, ఆర్‌హెచ్ పేజీలతో పాటు నకలు డాక్యుమెంట్లను అందించేవారు. ప్రస్తుతం వారు కార్యాలయాలకు రాకపోవడంతో సమస్య తలెత్తింది. వారి స్థానాల్లో కొత్తగా సిబ్బందిని నియమించాల్సిన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో నిత్యం వేలాది మంది రికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే భర్తీ చేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.
– బి. శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్
రిజిస్ట్రేషన్ శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత
రికార్డుల కోసం నెలల తరబడి ప్రజల ప్రదక్షిణలు
పట్టించుకోని ఉన్నతాధికారులు


