అనంతపురం: యూరియా, డిటర్జెంట్, రసాయనాలతో తయారు చేస్తున్న పాల గురించి విన్నాం. కొన్నిసార్లు చూశాం కూడా. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గేదెలు, ఆవులు ఎక్కువగా పాలు ఇచ్చేందుకు వాటికి డ్రగ్స్ ఇస్తున్నారు. తమ స్వలాభం కోసం నిషేధాన్ని ఉల్లంఘిస్తూ వీటిని ఉమ్మడి జిల్లాలోని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాడి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు మెడికల్ స్టోర్ల నిర్వాహకులు అక్రమ దందాకు తెరలేపారు. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని నమ్మిస్తూ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను కట్టబెడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఆక్సిటోసిన్ అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అయితే ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ వీటి విక్రయాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పాడి సంపద ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లోని మెడికల్ స్టోర్లలో ఆక్సిటోసిన్ విక్రయాలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గోపాల మిత్రల ద్వారా ఈ విక్రయాలను మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అనర్థాలు మెండు..
1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరమే అయినా, మెడికల్ స్టోర్ల నిర్వాహకులు మాత్రం వాటిని పాడి రైతులను ప్రలోభాలకు గురి చేస్తూ అంటగడుతున్నట్లుగా సమాచారం. వీటి వినియోగం వల్ల ఆవులు, గేదెలు చాలా తక్కువ కాలంలోనే వట్టిపోతాయి. వాటి పాలను తాగితే మనుషుల్లోనూ చాలా రకాల దుష్ట్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలురల్లో హార్మోన్ల అసమతుల్యత, బాలికల్లో రజస్వల అయ్యే వయసు తగ్గిపోవడం, చిన్న పిల్లల్లో కంటి చూపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. చిన్నారులకు పచ్చకామెర్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో అసౌకర్యం, నొప్పితో పాటు మెదడులోని కణాలు క్షీణించి మతిమరుపు సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. గర్భం ధరించిన వారు ఈ పాలు తాగితే గర్భస్రావం అవుతుందని, ఒకవేళ బిడ్డ పుట్టినా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, బిడ్డ పుట్టిన తర్వాత బాలింతల్లో హెమరేజ్ రిస్క్ కూడా అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిషేధాన్ని ధిక్కరించి మెడికల్ స్టోర్లలో స్టెరాయిడ్స్ విక్రయం
అధిక పాల ఉత్పత్తి కోసం పాడిపశువులకు వేస్తున్న వైనం
పాలు తాగిన వారిపై
తీవ్ర దుష్ప్రరిణాలు


