అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీ సెక్రటరీలను స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3గా పునర్విభజన చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ), డిజిటల్ అసిస్టెంట్ల ఎస్‌ఆర్‌ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఆర్సీ భవనంలో డీపీఓ నాగరాజనాయుడు ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన చేస్తున్నారు. ఎంపీడీఓలు, వారి ఆఫీసు సిబ్బంది, ఉమ్మడి జిల్లా ట్రెజరీ అధికారులు, ఆడిట్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశీలన చేస్తున్నారు.
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● ఇంటి తాళం బద్ధలుగొట్టి 15 తులాల బంగారు నగల అపహరణ
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిఽధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిద్దిలో నివాసముంటున్న దంపతులు రామాంజనేయులు, గీతమ్మ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రామాంజనేయులు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటి ఆవరణలో నిద్రించేవారు. సోమవారం బంధువుల ఇంటి వద్దకు దంపతులు వెళ్లిన సమయంలో ఇంటి తాళాన్ని దుండగులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 15తులాల బంగారు నగలు, రూ.6వేల నగదు అపహరించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రామాంజనేయులు దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.
స్టాక్ పాయింట్‌లో ఆరు గదులు ఉండాలి
● విద్యార్థి మిత్ర కిట్ల రాష్ట్ర పరిశీలకులు అనురాధ
అనంతపురం ఎడ్యుకేషన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను భద్రపరిచేందుకు స్టాక్‌పాయింట్లలో ఆరు గదులు ఉండేలా చూడాలని రాష్ట్ర పరిశీలకులు అనురాధ సూచించారు. మంగళవారం ఆమె కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఆత్మకూరు, అనంతపురం మండలాల్లో ‘విద్యార్థి మిత్ర’ స్టాక్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర అధికారులు ఇచ్చిన మ్యాపు ప్రకారమే వచ్చిన కిట్లను భద్రపరచాలన్నారు. స్టాక్ పాయింట్లలో తగినంత వెలుతురు ఉండేలా చూడాలన్నారు. గదుల్లోకి వర్షపు నీరు రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. కిట్లు తెచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా తగినంత స్థలం ఉండాలన్నారు. స్టాక్‌పాయింట్లకు కిట్లు చేరిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట సీఎంఓ చంద్రశేఖర్, ఆయా మండలాల ఎంఈఓలు, సీఆర్‌ఎంటీలు ఉన్నారు.
పెద్దొడ్డిలో ఇరువర్గాల ఘర్షణ
గుత్తి రూరల్: మండలంలోని పెద్దొడ్డి గ్రామంలో మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన రాజు, అశోక్‌కు సమీప బంధువైన నరేష్‌తో కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నరేష్ తన ఇంట్లో నుంచి రోకలిబండ తీసుకెళ్లి రాజు, అశోక్‌పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన మేనత్తలు పార్వతి, లక్ష్మీదేవిపై కూడా దాడి చేశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన రాజును వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చైన్ స్నాచర్‌కు దేహశుద్ధి
శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయిస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నార్పలలోని సుల్తాన్‌పేటలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో స్థానికులు అప్రమత్తమై దుండగుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
కేబుల్ చోరీ
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామ శివారులో తాగునీటి మోటార్ కేబుల్ సోమవారం రాత్రి చోరీ అయినట్లు పంచాయతీ కార్యదర్శి శివన్న తెలిపారు. తాగునీటి పథకం మోటారు నుంచి మొయిన్ బోర్డు వరకు ఉండే 30 మీటర్ల కేబుల్ ఎత్తుకెళ్లారు. కేబుల్ ఎత్తుకెళ్లడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, కొత్త కేబుల్ ఏర్పాటు చేసిన్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.


