● సూపర్ ఎల్‌నీనో ఎఫెక్ట్ కారణంగా ముఖం చాటేయనున్న వర్షాలు
రాయదుర్గం: గత ఐదేళ్లు సమృద్ధిగా కురిసిన వానలు ఈ ఏడాది ముఖం చాటేయనున్నాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలో రైతు పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. ఇప్పటి వరకూ వేసవి దుక్కులు సైతం ఊపందుకోలేని పరిస్థితి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తే కరువు కరాళనృత్యం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఖరీప్‌లో జిల్లాలో 16,54,080 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో వేరుశగన, కంది, ఆముదం, పత్తి మెజార్టీ పంటలు. జూన్ నుంచి సెఫ్టెంబర్ వరకు ఎల్‌నినో ముప్పు పొంచి ఉండవచ్చునని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది.
రుతుపవనాలు ముందే వచ్చినా?
నైరుతి రుతుపవనాలు జాన్ మొదటి వారంలోనే జిల్లాలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసినా ఎల్‌నినో దెబ్బకు ఆ తర్వాత పెద్ద విరామం ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆలోచించి అడుగేయాల్సి వస్తోంది. జిల్లాలో సాధారణంగా ఖరీప్‌లో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, సజ్జ, ఉలువ లాంటి పంటలు సాగుచేస్తారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సారి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే ప్రయోజనంగా ఉంటుంది. అలాగే తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉండడంతో బోరుబావుల కింద వరి కాకుండా ఇతర ఆరుతడుల పంటలు సాగు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆలోచించి అడుగేయాలి
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై ఇటీవల ఓ సమావేశం కూడా జరిగింది. సరైన స్పష్టత వెలువడాల్సి ఉంది. అలాంటిదేదైనా ఉంటే రైతులు ఆలోచించి అడుగేయాలి. తక్కువ వర్షాపాతానికి తట్టుకునే పంటల సాగుపై దృష్టిసారించడం మంచిది.
– మల్లికార్జున, సేద్యం విభాగపు శాస్త్రవేత్త, కళ్యాణదుర్గం


