ఉరవకొండలో సైకో వీరంగం | - | Sakshi
Sakshi News home page

ఉరవకొండలో సైకో వీరంగం

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

ఇద్దరిపై కత్తితో దాడి రెండు ద్విచక్ర వాహనాల ధ్వంసం

పోలీసు స్టేషన్‌లోనూ హల్‌చల్‌

అతికష్టం మీద తాళ్లతో బంధించిన స్థానికులు

ఉరవకొండ: స్థానిక హమాలీ కాలనీలో నివాసముంటున్న సైకో శేఖర్‌ మంగళవారం రెచ్చిపోయాడు. తెల్లవారుజామున చేతిలో కత్తి పట్టుకుని ఇందిరానగర్‌, హమాలీ కాలనీ, శివరాంరెడ్డి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఇందిరానగర్‌లో నివాసముంటున్న హనుమంతప్ప ఇంటి తలుపు తట్టడడంతో ఆయన ఎవరో వచ్చారని తలుపు తీయగానే వెంటనే కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. బస్టాండ్‌ ప్రాంతంలో బస్సు కోసం వేచి ఉన్న వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన నరసింహులుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. హమాలీ కాలనీలో ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న రెండు బైక్‌లను కట్టెలు, రాళ్లతో బాది ధ్వంసం చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో చొరబడి నానా హంగామా సృష్టించి, అక్కడ ఇనుంచి బయటపడి హమాలీ కాలనీకు చేరుకున్నాడు. ఆ సమయంలో కాలనీవాసులు ధైర్యం చేసి సైకోను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. సైకో చేతిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. గతంలో కూడా సైకో శేఖర్‌ ఉరవకొండ కోర్టు భవనం ఎక్కి ఎక్కి గొంతు కోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

విద్యుదాఘాతం... విద్యార్థి మృతి

చదువుకుంటూ...పనికి వెళ్తున్న విద్యార్థి

రాప్తాడు రూరల్‌: ఓవైపు చదువుకుంటూ మరోవైపు కుటుంబానికి అండగా ఉంటున్న విద్యార్థిని కరెంటు రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన మంగళవారం రాప్తాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురం రూరల్‌ జాకీర్‌కొట్టాలుకు చెందిన రితేష్‌ఖాన్‌ కుమారుడు అజాంఖాన్‌ (20) ప్రభుత్వ ఐటీఐలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీ సమయంలో టైల్స్‌ పనికి వెళ్లేవాడు. మంగళవారం రాప్తాడు మండలం కళాకారుల కాలనీలో టైల్స్‌ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ వైర్‌ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటున్న అజాంఖాన్‌ దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement