● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి టౌన్: రాష్ట్రంలో రైతుల బాగోగులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. మంగళవారం తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో ఆయన పర్యటించి, మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు అతి తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ 2,400 ప్రకటించిందని, కొనుగోలు కేంద్రాలు లేక కేవలం రూ.1,800తో దళారులు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కెఫెడ్ ద్వారా రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, క్రాప్‌ఇన్సూరెన్స్, ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలు, పంట కొనుగోలు కేంద్రాలు, రైతు బరోసా అందజేసారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా సక్రమంగా అందించలేకపోయిందని మండిపడ్డారు. తీవ్రమైన ఎండలు, వర్షాభావం కారణంగా భూగర్భజలాలు అడుగంటి ఉద్యాన పంటలు ఎండుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రోజూ రూ.వేల ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా ఉద్యాన పంటలకు సాగునీరందించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


