తాడిపత్రి టౌన్: ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా పచ్చదనాన్ని కోరుకుంటారు. గ్రీనరీ అంటే ఎవరికై నా ఇష్టం.. చెట్లు, పూల మొక్కలు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్లో ఇంటికే స్థలం సరిపోవట్లేదు... ఇక మొక్కలు పెట్టేందుకు స్థలమెక్కడిది? అయితే ఓ ఫర్టిలైజర్ షాపు యజమాని తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. వివిధ రకాల ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు పండిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఈ నందన వనాన్ని చూడాలనుకుంటే తాడిపత్రిని సందర్శించాల్సిందే. పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన రాజేష్, శ్రీలత దంపతులు తమ ఇంటి ఆవరణతో పాటు మిద్దైపె కూడా డ్రమ్ములు, బ్యాగ్‌లలో మట్టి నింపి 25 రకాల మందార మొక్కలు, నాలుగు రకాల మల్లె మొక్కలతో పాటు వివిధ రకాల పూలు, ఆకుకూరలు, మామిడి, జామ, నిమ్మ చెట్లను పెంచుతున్నారు. తన తండ్రి వెంకటరమణారావు మొక్కలపై మమకారంతో ఇంట్లో పచ్చని చెట్లను పెంచారని, ఆయన మరణాంతరం తండ్రి జ్ఞాపకాలను మొక్కల్లో చూసుకుంటూ మొక్కలను సంరక్షించుకుంటున్నట్లు రాజేష్ తెలిపారు.


