సాక్షిప్రతినిధి అనంతపురం: ‘హనీట్రాప్’ బీజం బీజేపీలో పడి టీడీపీలో విషవృక్షంగా ఎదిగి ‘అనంత’ వాసులను వేధించింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరికొంత మందిపై చర్యలు తీసుకునే దిశగా కేసును విచారిస్తున్నారు. రిమాండ్‌కు వెళ్లిన ముగ్గురు బీజేపీ మహిళా మోర్చా నేతలు చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆ పార్టీకి సంబంధించి మరో ఇద్దరు నేతల ప్రమేయంపైనా చర్చ నడిచింది. ఇద్దరిలో ఒకరి బ్యాంకు ఖాతాలోకి రంగమ్మ ఖాతా నుంచి రూ.15 లక్షల నగదు బదిలీ జరిగింది. అలాగే రంగమ్మను ప్రోత్సహించిన మరో మాజీ జిల్లా అధ్యక్షుడి ప్రమేయం కూడా హనీట్రాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మంత్రి సత్యకుమార్ కీలక అనుచరుడు కావడంతో పోలీసుస్టేషన్లలో ఆర్థిక వ్యవహారాలలో పంచాయితీలు కూడా చేశారు. రంగమ్మ బీజేపీలో ఉన్నప్పుడు ఆమెను, ప్రస్తుతం చంద్రకళను ప్రోత్సహించారు. చంద్రకళ మహిళా మోర్చా రాయలసీమ జోనల్ అధ్యక్షురాలిగా పని చేస్తూ హనీట్రాప్ కేసులో రిమాండ్‌కు వెళ్లారు. చంద్రకళకు జమ్మలమడుగులో ఇసుక క్వారీ ఇప్పించి ఆర్థికంగా స్థితిమంతురాలిని చేసే చర్యలు చేపట్టారు. ఇదంతా మంత్రి సత్యకుమార్ సహకారంతోనే జరిగిందనేది బీజేపీ నేతలే చెబుతున్న మాట! దీన్నిబట్టే చంద్రకళ వ్యవహారాలలో మంత్రి అనుచరుడికి ఏ మేరకు ప్రమేయం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చునని వారు అంటున్నారు. ఆయనపై హనీట్రాప్ ఆరోపణలు రావడంతో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తన ప్రమేయం లేదని చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆరోపణలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దాన్ని పార్టీకి ఆపాదించడమేంటని, ప్రెస్‌మీట్ వద్దని రాష్ట్ర నేతలు అడ్డుచెప్పారు. దీంతో ప్రెస్‌మీట్ చివరి నిమిషంలో ఆపారు.
బీజేపీ చీఫ్‌కు జిల్లా నేతల ఫిర్యాదు
హనీట్రాప్ ఉదంతం, పార్టీ నేతల ప్రమేయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్‌కు జిల్లా నేతలు వివరించారు. ఈ వ్యవహారంతో ‘అనంత’ బీజేపీ పరువు బజారున పడిందని ఇద్దరు కీలక నేతలు గట్టిగా ఫిర్యాదు చేశారు. ‘నగదు బదిలీ’ అయిన నేతపై వెంటనే చర్యలు తీసుకుందామని మాధవ్ చెప్పినట్లు సమాచారం. అలాగే మరో నేతపై చర్యలకు మంత్రి సత్యకుమార్ అడ్డుపడే అవకాశం ఉన్నందున అదను చూసి వేటు వేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఓ నేతపై ఏ క్షణమైనా వేటు పడొచ్చు! మరో నేతపై ఆలస్యంగా చర్యలు తీసుకోవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో దబ్బర రాజేష్ (ఫైల్)
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో రంగమ్మ (ఫైల్)
హనీట్రాప్‌లో ప్రమేయం ఉన్నవారిపై వేటుకు బీజేపీ నిర్ణయం
రంగమ్మ ఖాతా నుంచి నగదు బదిలీ అయిన నేతను బహిష్కరించే యోచన
రంగమ్మను ప్రోత్సహించిన మాజీ జిల్లా అధ్యక్షుడి అంశంలో ఆచితూచి నిర్ణయం
మంత్రి సత్యకుమార్ అడ్డుపడతారనే కారణంతో ఆయనపై ఆలస్యంగా చర్యలు !
జిల్లా నేతలకు సూచించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
ఇప్పటికే ముగ్గురు మహిళా మోర్చా నేతలు పార్టీ నుంచి సస్పెండ్
బీజేపీ తరహాలో టీడీపీ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు
హనీట్రాప్ ఉదంతంలో బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలూ ఉన్నారు. ఉరవకొండ నియోజకవర్గ నేతలు ఇద్దరు ఉన్నట్లు తేలింది. వీరిలో ఒకరు జిల్లా కమిటీలో అత్యంత ‘ప్రధానంగా’ ఉన్నారు. మరొకరు స్థానిక నేత! జిల్లా కమిటీలోని ‘ప్రధాన’ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు పిలిపించి విచారించారని తెలుస్తోంది. ఈ ఇద్దరి పాత్రను తేల్చి, వీరిని కూడా టీడీపీ నుంచి తప్పించాల్సిన బాధ్యతను జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తీసుకోవాలన్న చర్చ జనంలో నడుస్తోంది. అలాగే లేడీడాన్ రంగమ్మ మెడలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా ఆమెను సస్పెండ్ చేయించే బాధ్యత తీసుకోలేదు. దీంతో విమర్శలు వస్తున్నాయి. అనంతపురానికి చెందిన రాజేశ్ ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నాడు. ఒకవైపు బీజేపీ అధిష్టానం విడతల వారీగా చర్యలు తీసుకుంటుంటే... టీడీపీ మాత్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందనేది తేలాల్సి ఉంది. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే వారు బయటకు వచ్చి దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయల’ పేర్లు చెబుతారనే భయం ఆవహించిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


