టాపర్లకు కలెక్టర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

టాపర్లకు కలెక్టర్‌ అభినందనలు

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

అనంతపురం అర్బన్‌: పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఇతర విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చదువుతో పాటు సమాజం, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టాపర్లను కలెక్టర్‌ సన్మానించి ప్రశంసాపత్రం, మెమొంటో అందజేశారు. ఎస్సీ విభాగంలో జిల్లాస్థాయిలో టాపర్‌గా నిలిచిన తాడిపత్రి ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని లాస్యకు కలెక్టర్‌ చేతుల మీదుగా ఉపాధ్యాయుడు బి.నాగేంద్ర రూ.5 వేల ఆర్థిక సహాయన్ని అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాష్‌కుమార్‌, డీఈఓ ప్రసాద్‌బాబు, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం వీడకపోతే

రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్‌రావు హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఆప్టా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కాకి ప్రకాష్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగుల సహకారంతోనే విజయం సాధించామని, ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు గడిచినా కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. పైగా ‘మమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వండి’ అనే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేక భావాలు మొదలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతన పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సరెండర్‌ లీవ్‌ బిల్లులు నాలుగేళ్లుగా పెండింగ్‌ ఉన్నాయన్నారు. ప్రధానకార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఆప్టా జిల్లా ఆర్థిక కార్యదర్శి బీఏ శంకరమూర్తి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి చల్లా శివానంద, నాయకులు వలి, నారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు

పకడ్బందీగా నిర్వహించాలి

అనంతపురం అర్బన్‌: ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు సజావుగా జరగాలన్నారు. ఆరో తేదీ రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట్ల బారికేడ్ల ఏర్పాటు, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల వేళ తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించాలని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్‌కు సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ ఏసీ మల్లికార్జున ప్రసాద్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలక్ష్మి, పెన్నహోబిలం దేవస్థానం ఈఓ రమేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement