అనంతపురం ఎడ్యుకేషన్: అధికారిక ఉత్తర్వులు లేకుండా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలను రహస్యంగా బదిలీలు చేసేందుకు సమగ్ర శిక్ష అధికారులు పూనుకున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో సోమవారం బదిలీల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని పలువురు స్పెషలాఫీసర్లు, సీఆర్టీలు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వు లు, మార్గదర్శకాలు లేకుండా నోటిమాటతో ఎలా బదిలీలు చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ జరగనీయకుండా అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డీఈఓ ప్రసాద్‌బాబు ఎంత నచ్చజెప్పేప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరికి ఎస్టీయూ నాయకులు హరిప్రసాద్‌రెడ్డి, రామాంజులయాదవ్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్, ఏఐటీయూసీ చిరంజీవి, రాజు, ఏఐఎస్‌ఎఫ్ కుళ్లాయిస్వామి, అంజి, ఏఐవైఎఫ్ తేజు, రియాజ్‌బాషా తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాంగ్ స్టాండింగ్ పేరుతో ఐదేళ్లు పూర్తయిన ప్రిన్సిపాళ్లు, 8 ఏళ్లు పూర్తయిన సీఆర్టీలను బలవంతంగా బదిలీలు చేస్తున్నారన్నారు. ఓవైపు చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక కొట్టుమిట్టాడుతున్న కేజీబీవీ ఉద్యోగులను బెదిరింపు ధోరణిలో బదిలీలు చేయడం సమంజసం కాదన్నారు. వారికి మినిమం టైం స్కేలు వర్తింపజేసి ఉద్యోగభద్రత కల్పించిన తర్వాతనే ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను అనుసరించి బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు కౌన్సెలింగ్ జరగకుండా అడ్డుకున్నారు.
కలెక్టరేట్‌లో కౌన్సెలింగ్ పూర్తి
కౌన్సెలింగ్ ప్రక్రియను మధ్యాహ్నం తర్వాత సైన్స్ సెంటర్ నుంచి కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కార్యాలయానికి మార్చారు. డీఆర్‌ఓ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా పీజీటీలు, తర్వాత ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కాగా పలువురు విల్లింగ్ ఇవ్వలేదు. వారి స్థానాలకు విల్లింగ్ ఇచ్చిన వారిని బదిలీ చేశారు. విల్లింగ్ ఇవ్వని వారి స్థానాలకు బదిలీ అయిన వారు జాయిన్ అవుతారా లేదా? అనేది చూడాలి. మరోవైపు పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. స్టే రాకముందే కౌన్సెలింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద పూర్తి చేశారు.


