రూ.కోట్లు.. హాంఫట్‌! | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు.. హాంఫట్‌!

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

కళ్యాణదుర్గం మునిపాలిటీలో అవినీతి అక్రమాలు

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైనం

కళ్యాణదుర్గం: అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. తద్వారా బాగా డబ్బు వెనకేసుకున్నారు. పనులు పర్యవేక్షించి.. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు, దీనిపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సోమవారం సోషల్‌ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తమకు అనుకూలంగా ఉన్న కమిషనర్‌ను అధికార టీడీపీ నాయకులు కళ్యాణదుర్గానికి వేయించుకున్నారు. ఆ తర్వాత గతంలో పెండింగ్‌ పడిన పనులకు ఆగమేఘాలపై అనుమతులు తెప్పించుకున్నారు. వెనువెంటనే కాంట్రాక్ట్‌ పనులను టీడీపీ నాయకులు దక్కించుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, డివైడర్లు, కంపోస్టుయార్డు శుద్ధీకరణ పనులను హడావుడిగా ప్రారంభించారు. అయితే ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత ప్రమాణాలు కనిపించలేదు. అంతేకాదు ఆయా పనులు పూర్తికాకపోయినా రూ.30 కోట్ల దాకా బిల్లులు మంజూరు చేసినట్లు కమిషనర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కమిషనర్‌ పాత్రపై విచారణ!

అవినీతి అక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ పాత్ర ఉందంటూ గతంలో దళిత జనజాగృతి వ్యవస్థాపకుడు ఆర్‌కే రాజు ఏకంగా మున్సిపల్‌ కమిషనరేట్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై మరికొన్ని ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు గుట్టుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఆరోపణలు అవాస్తవం

మున్సిపాలిటీ పరిధిలో రూ.కోట్ల అవినీతి జరిగిందని సోషల్‌ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. అయినా సోషల్‌ మీడియాలో వచ్చే వాటికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవినీతి జరిగి ఉంటే విచారణలో బయట పడుతుంది. నాపై ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.

– వంశీకృష్ణ భార్గవ్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, కళ్యాణదుర్గం

Advertisement
 
Advertisement
Advertisement