● ఉమ్మడి జిల్లాలో వెయ్యి గ్రామాలకు నీరు బంద్
కళ్యాణదుర్గం రూరల్/ కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులు జీతాల కోసం సోమవారం రాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. మూడు యూనియన్ల పరిధిలోని 570 మంది కార్మికులు జేఏసీగా ఏర్పడి సమ్మెలోభాగంగా కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులో మోటర్లు పని చేయకుండా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దాదాపు 1000 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్ కానుంది. సత్యసాయి నీటి సరఫరా జేఏసీ నాయకులు వన్నూరప్ప, రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు కార్మికుల సమస్యలకు నేటికీ శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో తాగునీటి కార్మికులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అసలు సత్యసాయి నీటి ప్రాజెక్టును కొనసాగించాలనే ఉద్దేశం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని, పీఎఫ్ జమ చేయాలని, సత్యసాయి ప్రాజెక్టును పరిరక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
నకిలీ పట్టాలను నమ్మొద్దు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆర్‌ఓఎఫ్‌ఆర్ పథకం కింద జిల్లాలో 549 అటవీ హక్కుల పాసుపుస్తకాలను జిల్లాస్థాయి కమిటీ ఆమోదించిందని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనవాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పుస్తకాల్లో మంజూరు చేసినంత భూమి మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త అటవీ హక్కు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కొందరు బ్రోకర్లు రంగప్రవేశం చేసి నకిలీ పట్టాలు, ఉన్న పట్టాల్లో దిద్దుబాటు చేస్తున్నారని తెలిసిందన్నారు. లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వెంకటాంపల్లి చిన్నతండా, ఎన్‌ఎన్‌పీ తండా, పందికుంట తండా, పులగుట్టపల్లి తండా, బెళుగుప్పతండాలో గ్రామ సభలు నిర్వహించామన్నారు.


