అనంతపురం అర్బన్: వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు వచ్చి గోడు వెల్లబోసుకుంటున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని పలువురు దివ్యాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌తో పాటు జేసీ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్‌రెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు ప్రజల నుంచి 405 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలపై 197, ఇతర సమస్యలపై 208 అర్జీలు ఉన్నాయి. సమస్యలపై అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కాకపోవడంతో మళ్లీమళ్లీ కలెక్టరేట్‌కు రావాల్సి వస్తోందన్నారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారం పై అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
అర్జీల్లో మచ్చుకు కొన్ని...
● శింగనమల మండలం చక్రాయపేట రామాలయం వద్ద హైవే మీదుగా ఉన్న దారిని మూసివేయడంతో పంటపొలాలకు వెళ్లేందుకు, డెయిరీ పాలు పోసేందుకు వెళ్లడానికి కిలోమీటరు దూరం చుట్టుకుని రావాల్సి వస్తోందని గ్రామస్తులు అర్జీ అందజేశారు.
● తమ వ్యవసాయ పొలంలోకి వెళ్లేందుకు రస్తా ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని కుందుర్పి మండలం అప్పిలేపల్లికి చెందిన జయమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువైందని తెలిపింది.


