ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో సోమవారం లక్ష్మీ నృసింహస్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి గరుడవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి బొల్లినేని జయసింహ, బొల్లినేని కృష్ణవేణి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నరసింహస్వామి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, అర్చకులు పాల్గొన్నారు.


