నేడు ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘పరిష్కార వేదిక’

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

అనంతపురం అర్బన్‌: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసే రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించ వచ్చని తెలియజేశారు.

హనుమ వాహనంపై

నృసింహుడు

ఉరవకొండ రూరల్‌: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి హనుమంత వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహ స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమిద్యాల గ్రామానికి చెందిన గుర్రం సుధాకర్‌, గుర్రం రవీంద్రనాఽథ్‌ సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్‌ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

‘నిజాయితీకి’ న్యాయం!

డీఈఓ చేరికకు అనుమతులిచ్చిన

ఉన్నతాధికారులు

ఎట్టకేలకు బాధ్యతలు తీసుకున్న

ఎం.ప్రసాద్‌బాబు

అనంతపురం ఎడ్యుకేషన్‌: నిజాయితీ అధికారికి న్యాయం జరిగింది. జిల్లాలో విద్యాశాఖను గాడిలో పెట్టి అందరి మన్ననలు అందుకున్న డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు తీవ్ర పని ఒత్తిడితో అనారోగ్యం బారినపడి గుండెకు స్టంట్‌ వేయించుకన్న సంగతి తెలిసిందే. 15 రోజుల విశ్రాంతి అనంతరం వైద్యులు ఇచ్చిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా విధుల్లో చేరేందుకని వస్తే ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకుండా అవమానపరిచారు. గత నెల 24న విధుల్లో చేరాల్సి ఉన్నా...అనుమతులు రాకపోవడంతో ఎదురు చూశారు. ఈ క్రమంలో ‘సాక్షి’లో శనివారం ‘నిజాయితీకి న్యాయం ఎక్కడ?’ శీర్షికతో ప్రత్యేక కథనం వెలువడింది. ప్రసాద్‌ బాబు డీఈఓగా బాధ్యతలు చేపట్టకముందు జిల్లాలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. కలెక్టర్‌, ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతో పూర్తిగా చక్కదిద్దారు.ముఖ్యంగా సామాన్య టీచర్లు, చిరుద్యోగులు సైతం నేరుగా వచ్చి తమ సమస్యను చెప్పుకునేలా కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చిన వైనంపై ప్రచురితమైన కథనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లింది. కమిషనర్‌ కార్యాలయ అధికారులు వెంటనే స్పందించారు. కమిషనర్‌ ఆదేశాలతో ఆర్జేడీ శామ్యూల్‌, ప్రసాద్‌బాబుకు ఫోన్‌ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లాకు వచ్చిన ఎం.ప్రసాద్‌బాబు, కలెక్టర్‌ ఆనంద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనుమతి ఇవ్వడంతో ఎట్టకేలకు సాయంత్రం తన చాంబరులో బాధ్యతలు తీసుకున్నారు. ఏది ఏమైతేనేం మంచి అధికారికి న్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement