తాడిపత్రి రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు చౌకధాన్యపు డిపోల ద్వారా కంది పప్పు అందకుండా పోయింది. 2025 మే నుంచి పూర్తిస్థాయిలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు కోటాను ఎత్తివేసింది. అంతకు ముందు ఒక కోటా ఇవ్వకపోయినా మరో కోటా ఇచ్చేవారు. ఏడాది కాలంగా కందిపప్పుపై టెండర్లు పూర్తి కాలేదని, కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు కోటనే ఎత్తేసి లబ్ధిదారులకు పంగనామం పెట్టింది. 2014–19 టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ జరగలేదు. ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ఓట్లు కొల్లగొట్టేందుకు రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేపట్టింది.
నెలకు రూ.4.80 కోట్లకు పైగా భారం..
గతంలో ప్రతి నెల 667టన్నుల కందిపప్పు లబ్ధిదారులకు పంపిణీ జరిగేది. ప్రస్తుతం కేవలం రూ.67కే కిలో కందిపప్పును రేషన్ లబ్ధిదారులకు అందజేసేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కందిపప్పు ధరలు పెరిగినా రేషన్ దుకాణాల్లో మాత్రం నిర్ణీత ధరకే పేదలకు అందజేస్తూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కందిపప్పును దశల వారీగా తగ్గిస్తూ చివరకు కోటానే ఎత్తేశారు. ఫలితంగా జిల్లాలోని 6.67 లక్షల రేషన్‌కార్డుల లబ్ధిదారులపై నెలకు రూ.4.80కోట్లకు పైగా భారం పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో కందిపప్పు నాణ్యతను బట్టి రూ.140 ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేసి ఉంటే కిలోకు రూ.73కు పైగా అదా అయ్యేది. ఏడాది కాలంగా రూ.50 కోట్ల వరకు కందిపప్పు కొనుగోలు ద్వారా ప్రజలు నష్టపోతున్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం
నెలకు రూ.4.80 కోట్లకు పైగా నష్టపోతున్న లబ్ధిదారులు


