అనంతపురం అగ్రికల్చర్: కోరమాండల్ కంపెనీ నుంచి 627 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువు ఆదివారం జిల్లాకు చేరినట్లు ఇన్‌చార్జ్ ఏడీఏ, రేక్ ఆఫీసర్ వెంకటకుమార్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌లో వ్యాగన్లలో వచ్చిన ఎరువులను ఆయన పరిశీలించారు. 20–20–0–13 రకం 239 మెట్రిక్ టన్నులు, 14–35–14 రకం 239 మెట్రిక్ టన్నులు, 15–15–15 రకం 29 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ఆధారంగా ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
సనాతన బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకుందాం
అనంతపురం కల్చరల్: సనాతన బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకుందామని ప్రముఖ వేదపండితులు సతీష్‌శర్మ అన్నారు. నగరంలో వందలేళ్లనాటి శ్రీగురుదత్తాత్రేయ మందిరంలో ఆదివారం శ్రీగాయత్రి సమేత గణపతి, నవగ్రహ హోమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రీ శంకర విజయపరంపర వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి, గోపూజలు, రుద్ర సమేత గాయత్రి హోమం, కలశస్థాపన జరిగాయి. అనంతరం వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించి, మహాపూర్ణాహుతి జరిపించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సతీష్‌శర్మ, ఆలయ నిర్వాహకులు మాట్లాడారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, నారాయణ సేవ చేశారు.
రోడ్డు ప్రమాద రూపంలో ‘కూలి’న జీవితం
రాప్తాడురూరల్: దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రమేష్ (49) జీవితం రోడ్డు ప్రమాదంలో విషాదంగా ముగిసింది. రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదం కూలీల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన కూలీలు రోజులాగే పని కోసం అనంతపురం శివారు ప్రాంతానికి ఆటోలో బయల్దేరారు. రామినేపల్లి దాటి కాస్తా దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో ఆటో అదుపుతప్పి కిందపడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురయ్యారు. వారిలో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు, ఆటోను స్టేషన్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
దంపతులకు తీవ్ర గాయాలు
బత్తలపల్లి: మండలంలోని పోట్లమర్రి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోట్లమర్రి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య, నాగమ్మ దంపతులు ధర్మవరం సమీపంలోని చిన్నూరు వద్ద ఇల్లు నిర్మాణం చేపట్టారు. రోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఆదివారం కూడా ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, పోట్లమర్రి సమీపంలోని పెట్రోలు బంకులోకి వెళ్తుండగా, ఇదే సమయంలో బత్తలపల్లి వైపు నుంచి ధర్మవరం వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోతలయ్యకు ఎడమ కాలు విరిగింది. నాగమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వారిని ఆర్డీటీ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. క్షతగాత్రుల కుమారుడు సాకే చిన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైలు కింద పడేందుకు
మతిస్థిమితం లేని వ్యక్తి యత్నం
తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని పుట్లూరు రోడ్డు రైల్వేగేట్ వద్ద ఆదివారం సాయంత్రం గూడ్స్‌రైలు కింద పడబోతున్న అంజి అనే మతిస్థిమితంలేని వ్యక్తిని స్థానికులు రక్షించారు. అప్‌గేడ్ర్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు..చుక్కలూరు క్రాస్‌కు చెందిన అంజి.. పుట్లూరు రోడ్డులోని రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడబోతుండగా స్థానికులు కాపాడారు. వెంటనే సమాచారం అందించగా, ఘటనాస్థలికి వెళ్లి విచారించామని సీఐ తెలిపారు.


