అనంతపురం సెంట్రల్: హనీట్రాప్.. జిల్లాలోనూ, పోలీస్‌శాఖను కుదిపేసిన ఘటన.. అక్రమ సంపాదన కోసం కొందరు ఖాకీలు అడ్డదారులు తొక్కి పోలీసు శాఖకు మాయని మచ్చ తెచ్చారు. అవినీతికి పాల్పడిన ఓ సీఐ, ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో ఇద్దరు సీఐలు వీఆర్‌కు, ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు వేయడంతో పోలీసు శాఖ చరిత్రలో ఏనాడూ జరగలేదు. ఈ ఘటనతోనైనా అవినీతి పోలీసు అధికారులకు కనువిప్పు కలుగుతుందనే భావన వ్యక్తమైంది. అయితే కొందరిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇందుకు తాజాగా ఓ అవినీతి ఉదంతం బయటకు వచ్చింది. రిమాండ్ ఖైదీ నుంచి ఏకంగా డబ్బు వసూలు చేసిన విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు.. పోలీసుశాఖలోని ఏఆర్ విభాగం కానిస్టేబుల్ అవినీతి ఉదంతమిది. రిమాండ్ ఖైదీలకు కోర్టు వాయిదా బందోబస్తు నిమిత్తం వెళ్లిన సదరు కానిస్టేబుల్ ఏకంగా నిందితుడితోనే డీల్ కుదుర్చుకున్నాడు. ఓ దొంగతనం కేసులో సదరు నిందితుడు పట్టుబడినట్లు సమాచారం. రెడ్డిపల్లి సబ్‌జైలు నుంచి పలుమార్లు రాయదుర్గం కోర్టుకు సదరు నిందితుడిని వాయిదాలకు తీసుకుపోయేవారు. ఎస్కార్ట్ వాహనంలో నిందితులకు బందోబస్తుగా సదరు కానిస్టేబుల్ వెళ్లేవాడు. ఇలా పలుమార్లు సదరు నిందితుడితో చర్చలు జరిపాడు. ఈ కేసులో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను..బెయిల్ రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని సదరు కానిస్టేబుల్ నమ్మబలికాడు. నిందితుడి బంధువుల నుంచి రూ.65 వేలు ఒకేసారి ఫోన్‌ఫే ద్వారా తన బ్యాంకు ఖాతాకు వేయించుకున్నాడు. బెయిల్ రావడానికి కావాల్సిన ష్యూరిటీలు ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ చేతులెత్తేశాడు. దీంతో నిందితుడు, వారి బంధువులు డబ్బులు తీసుకొని పనిచేయలేదు.. డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా ఘటన బయటకు పొక్కింది.
గుట్టుగా విచారణ..
ఏఆర్ కానిస్టేబుల్ అవినీతి ఉదంతంపై గుట్టుగా పోలీసులు విచారిస్తున్నారు. డబ్బు తీసుకున్న మాట వాస్తమని విచారణలో కానిస్టేబుల్ అంగీకరించినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీకి.. కానిస్టేబుల్‌కు మధ్య ఓ లాయర్ రాయభారం నడిపినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై రెండు, మూడు రోజుల్లో సదరు కానిస్టేబుల్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా పోలీసుశాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుంది.
ఓ ఖైదీ నుంచి ఏఆర్ కానిస్టేబుల్
డబ్బు వసూలు
రూ.65 వేలు ఫోన్ పే ద్వారా వసూలు


