గుంతకల్లు టౌన్: వేలాది మంద్రి ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూలనపడింది. గత ప్రభుత్వం సమకూర్చిందనే అక్కసుతోనే ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా సమయంలో అప్పటి ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి అభ్యర్థన మేరకు నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ సహకారంతో ఎంపీ కోటా నిధుల కింద అత్యాధునిక అంబులెన్స్‌ను గుంతకల్లుకు సమకూర్చారు. ఆ సమయంలో వేలాది మంది కరోనా బాధితులను ఈ అంబులెన్స్ కాపాడింది. అనంతరం కాలంలోనూ విశిష్ట సేవలను అందిస్తూ వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహణ లోపం కారణంగా ఈ అంబులెన్స్‌ను మూలన పెట్టేశారు. దీంతో అత్యవసర రోగులను గోల్డెన్ అవర్‌లో కర్నూలు, అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు చేరవేయడం గగనమైంది. గతంలో పనిచేసిన కలెక్టర్ వినోద్‌కుమార్ సైతం ఈ అంబులెన్స్ కండీషన్ బాగున్నట్లుగా తెలుసుకుని వెంటనే ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలూ లేవు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గమ్మునుండడంతోనే అంబులెన్స్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికై నా అంబులెన్స్‌ను ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


