గుంతకల్లు: వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని నెలగొండ, చింతలాంపల్లి, నల్లదాసరపల్లి, పాతకొత్తచెరువు, ఇమాంపురం గ్రామాల మాజీ సర్పంచులు పాటిల్ భాగ్యమ్మ, పద్మావతి, ఎర్రలింగమ్మ, మల్లికార్జున, రంగన్న మాట్లాడారు. తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని, అయితే తమకు న్యాయ స్థానాలపై నమ్మకం ఉందన్నారు. అందుకే త్వరగా బెయిల్ మంజూరైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా వేధించారన్నారు. గ్రామాల్లో నీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రజల వినతుల మేరకు..రూ.లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. అయితే మండల అధికారులు బిల్లులు చేయలేదని జిల్లా ఉన్నాతాధికారు దృష్టికి తీసుకెళ్లినా ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. తాము ఎక్కడా కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణలపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.


