ఆవుకు సీమంతం.. దూడకు పుట్టిన రోజు! | - | Sakshi
Sakshi News home page

ఆవుకు సీమంతం.. దూడకు పుట్టిన రోజు!

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

ఆత్మకూరు: మండల కేంద్రంలో ఓ రైతు కుటుంబం ఆవుకు సీమంతం.. చేసి, ఆ ఆవు దూడకు పుట్టిన రోజు జరిపిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆత్మకూరుకు చెందిన గూలి పెద్దిరెడ్డి, ఆయన కుమారులు గూలి కొండారెడ్డి, గూలి వెంకటరెడ్డి తమ ఇంట్లో ఆవు జన్మించడంతో ఆడపడుచులా చూసుకున్నారు. ఆ ఆవుకు జన్మించిన దూడకు శనివారం పుట్టిన రోజు కావడంతో వేడుకలు నిర్వహించారు. తమ కాలనీలోని వారందరినీ పిలిచి దూడ ముందు కేక్‌ కట్‌ చేసి సంబరం చేసుకున్నారు. అదే విధంగా ఆ దూడ తల్లి ప్రస్తుతం గర్భం దాల్చడంతో దానికి కూడా సీమంతం చేశారు. ముత్తయిదువులచేత హారతి ఇచ్చి, నుదుటిన బొట్టు పెట్టారు. పూలు వేసి.. పసుపు, కుంకుమ చల్లి చీర పెట్టి సీమంతం చేశారు. ఈ సందర్భంగా అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను తోటి రైతులతో పాటు మహిళలు మెచ్చుకున్నారు. మనుషులకే శుభకార్యాలు చేయని ఈ రోజుల్లో మూగ జీవాలను తమ ఇంట్లో మనుషులుగా భావించి వేడుకలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement