అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15), (ఆర్–23) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ శారద, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.
‘నీట్’కు సర్వం సిద్ధం
● ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
అనంతపురం అర్బన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన శనివారం వెల్లడించారు. ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేస్తారని, ఆ తరువాత ఎవరినీ కేంద్రాల్లో అనుమతించబోరని అన్నారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
ఆత్మకూరు: పని ప్రదేశంలో వడదెబ్బకు గురైన ఉపాధి హామీ కూలీ ఇంటికి వచ్చాక మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు... వడ్డుపల్లికి చెందిన బొజ్జన్న (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చాక నీరసంగా ఉందని పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య దేవి నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఉలుకూపలుకు లేదు. దీంతో గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను పిలిచి పరిశీలించగా.. బొజ్జన్న అప్పటికే మృతి చెందాడు. బొజ్జన్నకు ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు.
హంస వాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో శనివారం లక్ష్మీ నృసింహసామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలతో అలంకరించి హంస వాహనంపై కొలువు దీర్చారు. అనంతరం పల్లకీని ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి వేలూరు నారమ్మ మనువడు రంగయ్య ఆమిద్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు.
65 ప్రాంతాల్లో వేసవి
క్రీడా శిక్షణ శిబిరాలు
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా 65 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) మంజుల తెలిపారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, ఖో–ఖో, కరాటే, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, సెపక్‌త్రా, స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, వ్రెస్టింగ్, తైక్వాండో, సాఫ్ట్‌బాల్, కర్రసాము క్రీడల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు అనంతపురం అశోక్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని డీఎస్‌డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


