రెసిడెన్షియల్‌ శిక్షణ అట్టర్‌ఫ్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

రెసిడెన్షియల్‌ శిక్షణ అట్టర్‌ఫ్లాప్‌

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రెసిడెన్షియల్‌ శిక్షణ’ కార్యక్రమం జిల్లాలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మొత్తం 409 మంది విద్యార్థులను ఈ శిక్షణకు ఎంపిక చేయగా.. వారిలో 143 మంది (34.96 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 266 మంది (65.04 శాతం) విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం, క్షేత్రస్థాయిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో చివరికి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఆలోచన మంచిదే... అమలే అధ్వానం

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ఒకేచోట ఉంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని కేజీబీవీలు, ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేసే విధానంలో అనేక లోపాలు బయటపడ్డాయి.

గైడ్‌లైన్స్‌ లేకుండా దూకుడుగా..

కార్యక్రమం అమలుకు ముందుగా స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జిల్లాల అధికారులకు సరైన దిశానిర్దేశం లేకుండా బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రతి చోటా వేర్వేరు విధానాలు అనుసరించాల్సి వచ్చింది. హాస్టళ్లలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు టీచర్లను నియమించాలి. అలా ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం చెప్పింది కదా అని జిల్లాస్థాయి అధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలపై బలవంతం చేశారు.

టీచర్లు లేక... పర్యవేక్షణ గాలికి..

విద్యార్థులను హాస్టళ్లకు తరలించినప్పటికీ, అక్కడ అవసరమైన టీచర్లను నియమించకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లల చదువులో క్రమశిక్షణ తగ్గి, చదువు గాడి తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు పరిచయం ఉన్న పాఠశాల వాతావరణం నుంచి అకస్మాత్తుగా హాస్టళ్లకు మారడం కూడా విద్యార్థులపై ప్రభావం చూపింది. సరైన కౌన్సెలింగ్‌ లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. ప్రణాళికా దశలో క్షేత్రస్థాయి వాస్తవాలపై పరిశీలన లేకపోవడమే ఈ కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్‌ కావడానికి కారణమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ‘రెసిడెన్షియల్‌ శిక్షణ’ కార్యక్రమం, సరైన అమలు లేకపోతే ఎలా విఫలమవుతుందో ఈ కార్యక్రమమే ఉదాహరణ అని స్పష్టం చేస్తున్నారు.

పదో తరగతి విద్యార్థులకోసం ప్రతిష్టాత్మకంగా అమలు

గైడ్‌లైన్స్‌ లేకుండా జిల్లాలపై భారంగా మారిన ప్రోగ్రాం

పర్యవేక్షణ లోపంతో ఫలితాల్లో పల్టీ

జిల్లాలో 409 మంది విద్యార్థులకు 143 మంది ఉత్తీర్ణత

Advertisement
 
Advertisement
Advertisement