రేషన్‌ సరుకుల పంపిణీలో కోతలు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ సరుకుల పంపిణీలో కోతలు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

అనంతపురం అర్బన్‌: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్‌ సరుకుల్లో చంద్రబాబు ప్రభుత్వం కోతలు పెడుతూనే ఉంది. కందిపప్పు పంపిణీకి మంగళం పాడిన ప్రభుత్వం నిత్యావసర సరుకుల్లో ఒక్కొక్కటిగా తగ్గించేస్తోంది. ఈ నెల జొన్నలు, రాగులు కోటా ఇవ్వని కారణంగా పంపిణీ నిలిచింది. ఆర్భాటంగా ప్రకటించిన గోధుమపిండి పంపిణీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. చౌకధరల దుకాణాల్లో ప్రస్తుతం బియ్యం, చక్కెర మాత్రమే అందిస్తున్నారు.

స్టోర్లకు చేరని బియ్యం కోటా

జిల్లా వ్యాప్తంగా 1,645 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా రేషన్‌ ఒకటో తేదీ నుంచి 15 వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ముందు నెల చివరినాటికి స్టోర్లకు బియ్యం, సరుకులు సరఫరా కావాలి. అయితే ఈ నెల బియ్యం కోటా చాలా స్టోర్లకు రెండో తేదీ అయినా సరఫరా కాలేదు.

కేటాయింపులు ఇలా...

జిల్లాలో 6,72,623 బియ్యం కార్డులు ఉన్నాయి. వీటిలో 20,70,917 యూనిట్లు (సభ్యులు) ఉన్నాయి. కోటా విషయానికి వస్తే జిల్లాకు ప్రతి నెలా 10,118 టన్నుల బియ్యం, 673 టన్నుల చక్కెర, 650 టన్నుల జొన్నలు, 630 టన్నుల రాగులు, 669 టన్నుల గోధుమపిండి కేటాయింపు ఉంది. అయితే ఈ నెల రాగులు, జొన్నల కోటా సరఫరాకాలేదు. దీంతో కార్డుదారులకు ఆ సరుకులు అందని పరిస్థితి. ఇక గోధుమపిండి కూడా కోటా మేరకు సరఫరా కాని కారణంగా మొక్కుబడిగా కొన్ని ప్రాంతాల్లోనే పంపిణీ చేస్తున్నారు.

బియ్యం సరఫరా అవుతున్నాయి

ప్రతినెలా 31లోగా బియ్యం, సరుకులు స్టోర్లకు సరఫరా అవుతాయి. అయితే ఈసారి సాంకేతిక కారణాల వల్ల కొన్ని చౌక దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. ఒకట్రెండు రోజుల్లో అన్ని దుకాణాలకూ బియ్యం చేరుతాయి. ఇక రాగులు, జొన్నలు స్టాక్‌ అయిపోయింది. వాటి సేకరణ చేపట్టాం. గోధుమపిండి కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. – రమేష్‌రెడ్డి,

జిల్లా మేనేజర్‌, పౌర సరఫరాల సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement