క్షణికావేశం తీసింది ప్రాణం | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం తీసింది ప్రాణం

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

మనస్తాపంతో టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం ఎడ్యుకేషన్‌/యాడికి: క్షణికావేశం టెన్త్‌ విద్యార్థిని ప్రాణం తీసింది. ఒక్క మార్కుతో ఫెయిల్‌ అవడాన్ని సున్నిత మనస్కురాలైన ఆ విద్యార్థిని జీర్ణించుకోలేకపోయింది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ వంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... యాడికి మండలం నిట్టూరుకు చెందిన వెంకటరమణ, అనూష దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె జింకల అపర్ణ (15) ఇటీవల రాసిన పదో తరగతి పరీక్షల్లో 410 మార్కులు సాధించింది. తెలుగులో 73, హిందీలో 81, ఇంగ్ల్లిష్‌లో 70, గణితంలో 67, సోషల్‌లో 85 మార్కులు తెచ్చుకుంది. అయితే సైన్స్‌లో 34 మార్కులే వచ్చాయి. ఒక్క మార్కు తేడాతో ఫెయిలైంది. దీన్ని అపర్ణ జీర్ణించుకోలేకపోయింది. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వారు పాస్‌ కావడం, తాను ఫెయిల్‌ కావడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యవసాయానికి వినియోగించే విషద్రావకం తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ వంటి అవకాశాలు ఉన్నప్పటికీ, అవగాహన లేక క్షణికావేశంతో విలువైన జీవితం ఆగిపోయింది. పరీక్ష ఫలితాలే జీవితం కాదు అని, కేవలం ఒక దశ మాత్రమే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఫెయిల్‌ అయినా, మార్కులు తక్కువ వచ్చినా తిరిగి ప్రయత్నించే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయంటున్నారు. ఒక పరీక్షలో ఫెయిల్‌ అవ్వడం అంటే జీవితంలో ఫెయిల్‌ కాదని చెబుతున్నారు. మార్కులు కంటే ప్రాణం విలువైనదని, ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందని అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement