కాలవ ఇలాకాలో తాగునీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కాలవ ఇలాకాలో తాగునీటి కష్టాలు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

రాయదుర్గం టౌన్‌/గుమ్మఘట్ట: ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సొంత నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. గత సోమవారం రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డు ప్రధాన రహదారిపై తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై బైటాయించగా, తాజాగా మరోసారి శనివారం మధుటాకీస్‌ ప్రాంతంతో పాటు గుమ్మఘట్ట మండలం కోనాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. రాయదుర్గంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం వద్దకు మున్సిపల్‌ డీఈ సురేష్‌, పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని, అప్పటి వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. ఇక గుమ్మఘట్ట మండలం కోనాపురంలో చేపట్టిన ధర్నాపై అధికారులు కనీసంగానూ స్పందించలేదు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుకు అడ్డంగా ఖాళీబిందెలు, ముళ్లకంపలు వేసి ఆందోళన వ్యక్తం చేసినా గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇలాంటి తరుణంలో పట్టణ ప్రాంతంతో పాటు గ్రామాల్లోనూ గతంలో మాదిరి చేతి పంపులు ఏర్పాటు చేస్తే తమ ఇబ్బందులు కాస్తేనా తీరుతాయని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement