కోటంకలో ఎండిపోయిన చీనీతోట
అనంతపురం అగ్రికల్చర్/గార్లదిన్నె: చీనీ పంటకు అనంతపురం జిల్లా ప్రసిద్ధిగాంచింది. 91 వేల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయి. ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా, ఉద్యానహబ్‌గా పిలవబడుతోందంటే దానికి కారణం ప్రధానంగా చీనీ తోటలే. అత్యధికంగా గార్లదిన్నె మండలంలో 19 వేల ఎకరాలు, కూడేరు 10 వేలు, యల్లనూరు 9,900, పామిడి 5,900, నార్పల 5,000, శింగనమల 4,500, పుట్లూరు 4,400, రాప్తాడు 4,000, ఆత్మకూరు 3,850, అనంతపురం 3,820, బుక్కరాయసముద్రం 2,350, బెళుగుప్ప 1,800, కళ్యాణదుర్గం 1,600, గుత్తి 1,600, పెద్దవడుగూరు 1,500, కంబదూరు, తాడిపత్రి 1,000 ఎకరాలు సాగవుతోంది. గత రెండు సీజన్లు అంటే ఏడాదిన్నర కాలంగా టన్ను రూ.20 వేలకు మించి ధర లేకపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ధరలు పెరిగినా ఇప్పటికే చాలా మంది రైతులు తక్కువకే పంటను అమ్మేసుకున్నారు. ఇప్పుడు భూగర్భజలాలు తగ్గిపోవడంతో చెట్లను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
ట్యాంకర్లతో నీటి తడులు
అత్యధిక విస్తీర్ణంలో చీనీ సాగువుతున్న మండలం గార్లదిన్నె. ముకుందాపురం, కోటంక, మర్తాడు, సంజీవపురం, యర్రగుంట్ల, పెనకచెర్ల, బూదేడు, కమలాపురం, కొప్పలకొండ, గార్లదిన్నె, ముంటిమడుగు, క్రిష్ణాపురం, కనంపల్లి... ఇలా గ్రామ గ్రామాన చీనీ తోటలు ఉన్నాయి. 2019–2024 మధ్య కాలంలో భారీ వర్షాలు కురవడంతో ఆ ఐదేళ్లూ నీటి సమస్య లేకుండాపోయింది. అయితే గత రెండేళ్లుగా అనుకున్నస్థాయిలో వర్షాలు కురవకపోవడం, కురిసినా అకాలంలో పడటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి.
లైనింగ్‌తో మరింత నష్టం
హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్‌తో లైనింగ్ చేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పాతాళగంగ పైకి రావడం లేదు. దీంతో బోర్లలో నీళ్లు అడుగంటాయి. 700 నుంచి 1000 అడుగుల లోతు వరకు కొత్తగా బోర్లు వేయిస్తున్నా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. దీంతో చీనీ తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి చొప్పున వెచ్చించి తడులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ముకుందాపురం, మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో చీనీతోటలు నీటి సమస్యను బాగా ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ మూడు గ్రామాల మధ్యలో అటవీప్రాంతం ఉండటం, కొంచెం మిట్ట ఉండటం, అలాగే ఒట్టికుంట అనే చిన్నపాటి చెరువు పూర్తిగా ఎండిపోవడం వల్ల సమస్య జఠిలంగా మారిందని అంటున్నారు. నీళ్లు లేక అవస్థలు పడుతున్న తోటి రైతుల కష్టాలను కళ్లారా చూస్తున్న మర్తాడుకు చెందిన ఆదర్శ రైతు తాతిరెడ్డి మానవత్వంతో తన తోటలోని బోర్ల నుంచి ట్యాంకర్లకు ఉచితంగా నీరందిస్తున్నారు. తగినన్ని నీళ్లు లేకపోవడం, మండే ఎండలకు వేరుకుళ్లు, ఎండుతెగులు వల్ల పెద్ద పెద్ద చెట్లు సైతం నిలువునా ఎండిపోతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా
భూగర్భజలాలు అడుగంటి, బోర్లలో నీళ్లు తగ్గిన దుస్థితి
చాలా ప్రాంతాల్లో నీళ్లు లేక నిలువునా ఎండుతున్న చెట్లు
జిల్లా వ్యాప్తంగా 91 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు


