బ్రహ్మసముద్రం : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదేవిధంగా కుటుంబ జనగణన సర్వేను కలెక్టర్ ప్రారంభించారు. కుటుంబ గృహగణనలో కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని ప్రజలకు సూచించారు. జనగణన వల్ల మీ ఇంటికి వచ్చేసంక్షేమ పథకాలకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుతో కలిసి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా దాదాపు 68 ఆర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి వచ్చిన తక్షణమే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ సుమతి, ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్య, ఎంఈఓ ఓబుళపతి, ఏపీఓ శారద, మండల వైద్యాధికారి రాజేష్‌కుమార్ పాల్గొన్నారు.
టన్ను మామిడి
రూ.1.20 లక్షలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మామిడి మార్కెట్‌లో శుక్రవారం టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 310 టన్నులు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశారన్నారు. అందులో టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు, కనిష్టంగా రూ.40 వేలు, సరాసరిన రూ.80 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.
గాలివానకు
రూ.50 లక్షల పంట నష్టం
అనంతపురం అగ్రికల్చర్: భారీ ఉరుములు, మెరుపుల మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 16 మండలాల పరిధిలో 3.9 మి.మీ సగటు నమోదైంది. రాప్తాడు 35.2 మి.మీ, పెద్దవడుగూరు 14.8, కళ్యాణదుర్గం 11, గుత్తి 9.4, అనంతపురం 6.4, బుక్కరాయసముద్రం 6.2 మి.మీతో పాటు నార్పల, పామిడి, కూడేరు, గార్లదిన్నె, కంబదూరు, బొమ్మనహాళ్, పుట్లూరు, కణేకల్లు, ఉరవకొండ, ఆత్మకూరు తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో అనంతపురం, గుత్తి, రాప్తాడు తదితర మండలాల్లో అక్కడక్కడా 20 హెక్టార్లలో అరటి, చీనీ, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.50 లక్షల వరకు పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.
వైభవంగా గో వాహనోత్సవం
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు గోవాహనంపై విహరించారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలకరించి గోవాహనంపై కొలుదీర్చారు. డప్పు, మేళతాళాలు, వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి సూరా లక్ష్మీపతి, సూరా క్రిష్ణమూర్తి, సూరా విశ్వనాథ్, సూరా వెంకటచలమయ్యశెట్టి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఆలయం చుట్టూ ఊరేగించారు. సుదర్శనం మదిగుబ్బ గ్రామానికి చెందిన వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు.


