● విద్యాశాఖను సజావుగా నడిపిన అధికారికి అవమానం
● అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లిన డీఈఓ ప్రసాద్‌బాబు
● తిరిగి వచ్చిన తర్వాత విధుల్లో చేర్చుకోని ఉన్నతాధికారులు
● అనుమతుల కోసం వారం రోజులుగా ఎదురుచూస్తున్న అధికారి
● పరిపాలనా ఆలస్యమా..? ఏదైనా రాజకీయ కారణాలున్నాయా?
● ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల్లో తీవ్ర చర్చ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో విద్యాశాఖను గాడిలో పెట్టి అందరి మన్ననలు అందుకున్న డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు ప్రస్తుతం సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యావ్యవస్థను ఆయన బాధ్యతలు తీసుకున్న చక్కదిద్దారు. పెండింగ్‌లో ఉన్న అనేక ఫైళ్లను వ్యక్తిగతంగా పరిశీలించి, న్యాయబద్ధమైన వాటికి పరిష్కారం చూపడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్, ఉన్నతాధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించడంలో ప్రసాద్‌బాబు చూపిన చొరవ అందరినీ ఆకట్టుకుంది. మరీముఖ్యంగా ఒక సాధారణ ఉపాధ్యాయుడు నేరుగా వచ్చి తన సమస్యను చెప్పుకునేలా కార్యాలయాన్ని అందుబాటులో ఉంచడం ఆయన ప్రత్యేకత. ‘నొప్పించక.. తానొవ్వక’ అన్న విధంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా, బాధితులకు న్యాయం చేయాలనే ధ్యేయంతో పనిచేసిన అధికారిగా పేరు సంపాదించారు. అయితే ఇటీవలి కాలంలో తీవ్ర పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై గుండెకు స్ట్టంట్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యుల సూచన మేరకు 15 రోజుల విశ్రాంతి తీసుకున్న అనంతరం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ కూడా పంపించారు. గత నెల 24న విధుల్లో చేరాల్సి ఉంది. కానీ వారం దాటినా ఆయన్ను విధుల్లో చేర్చడంపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా పనిచేసే అధికారిని ఇలా అవమానించడం సరైనదా? అనే ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 20 రోజులకు పైగా జిల్లా విద్యాశాఖకు అధికారి లేకపోవడంతో కీలక ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయి. ఇది విద్యావ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పరిపాలనా ఆలస్యం మాత్రమేనా..? లేక దీనివెనుక ఏదైనా రాజకీయ కారణాలున్నాయా..? అనే అభిప్రాయాలు ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రసాద్‌బాబుకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు వెంటనే స్పందించి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని, నిజాయితీగా పనిచేసే అధికారికి న్యాయం చేయాలని ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.


