● జిల్లాలో 129 గ్రామాలో తాగునీటి సమస్య
అనంతపురం టవర్‌క్లాక్: ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సరైన వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు ఆవిరైపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరు పైకి రావడం లేదు. దీంతో తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. జిల్లాలోని రాప్తాడు, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లోని 129 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో నీటికోసం దూర ప్రాంతాలకెళ్లి తెచ్చుకుంటున్నారు. అతి త్వరలో 78 గ్రామాల్లో నీటి సమస్య తారస్థాయికి చేరనుంది.
● ఇక జిల్లా వ్యాప్తంగా 3,600 చేతిపంపులు ఉన్నాయి. వీటిలో కూడా చాలావరకు నీటిమట్టం పడిపోయింది. జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద 2028 నాటికి ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికి జిల్లాలోని 1,071 గ్రామ పంచాయతీల పరిధిలో 77 గ్రామాల్లో అమలవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులకు రూ.30 కోట్ల వేతనాలను గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆయన చెప్పినది అవాస్తవమని తేలింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో బకాయిలు ఉంటే గత ప్రభుత్వంపైకి నెపం నెట్టి మంత్రి విమర్శలు మూటగట్టుకున్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. రాప్తాడు, శిగనమల, గుంతకల్లు నియోజకవర్గలో 78 గ్రామాలకు రాబోవు రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తవచ్చు. ఆయా గ్రామాలకు ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జల్ జీవన్ కార్యక్రమం కింద నిర్దేశిత గడువులోపు ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. తాగునీటి సరఫరా కార్మికులకు రెండు నెలలు మాత్రమే వేతనాలు బకాయిలు ఉన్నాయి. త్వరలోనే బకాయిలు చెల్లిస్తాం.
– రేగులగడ్డ సురేష్, ఆర్‌డబ్ల్యూస్ ఎస్‌ఈ


