● ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలి మెట్టు
● మార్పు తెచ్చే మార్గాలు ఎన్నో
● యాడికిమండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన విద్యార్థిని అపర్ణ పదో తరగతిలో అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినా... సైన్స్ సబ్జెక్ట్‌లో మాత్రం ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం తరలించారు.
● హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన హంసశ్రీ(15) ఇదే మండలంలోని కె.బసవనపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదివి పరీక్షలు రాసింది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయినట్లుగా గుర్తించి బాధతో ఆత్మహత్య చేసుకుంది.
... ఈ రెండు ఘటనలే కాదు... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూడని మరిన్ని ఉన్నాయి. అయితే మార్కులే జీవితం కాదని, ఒక్కోసారి ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలి మెట్టుగా మారుతుందనే విషయాన్ని గుర్తించకపోవడం బాధాకరం. కీలకమైన ఇలాంటి సమయంలోనే మార్పు తెచ్చే ఎన్నో మార్గాలు ఉన్నాయని, వాటిని అనుసరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
రాయదుర్గం టౌన్/హిందూపురం టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రలు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తూ వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు పెంచుతున్నారు. దీంతో విజయం సాధించలేక చతికిల పడినప్పుడు ఆత్మనూన్యత భావానికి లోనై విద్యార్థులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఓటమి కూడా భవిష్యతులో విజయానికి తొలి మెట్టుగా మారుతుందని మానసిక నిపుణులు, విద్యావంతులు పేర్కొంటున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్‌లో రెండుసార్లు ఫెయిలైన రాజస్తాన్‌కు చెందిన అంజుశర్మ.. ఏమాత్రం నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదువుకుని యూపీఎస్‌సీ తొలి ప్రత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారని గుర్తు చేస్తున్నారు.
ఇవి గుర్తుంచుకోండి...
● పరీక్షలు అనేవి తలరాతను మార్చలేదు.
● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం.
● పిల్లలు వారి సమస్యలు చెప్పుకునేలా చిన్నప్పటి నుంచే వారితో తల్లిదండ్రులు మెలగాలి.
● ఓటమి నుంచే విజయం వరిస్తుందనే స్ఫూర్తిదాయక విజయాలను సాధించిన వారి జీవన విధానాలను వివరించాలి.
మార్కులు శాశ్వతం కాదు
ఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా మళ్లీ ప్రయత్నించి జీవితంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మార్కులు తక్కువ వస్తే జీవితమే ఆగిపోయినట్లు భావించకుండా మళ్లీ ప్రయత్నించాలి. అపజయం తర్వాత వచ్చే విజయం ఎంతో బలాన్ని అందిస్తుంది.
– మహమ్మద్ ఇర్షాద్, ఎంఈఓ, రాయదుర్గం
ఓటమి అనేది కామన్
ప్రతి విజయం వెనుక ఓటమి అనేది కామన్ అంశం. ఆత్మహత్య చేసుకోవడమనేది సమస్యకు పరిష్కారం కాదు. ఫెయిలయ్యామనో.. మార్కులు తక్కువగా వచ్చాయనో ఆత్మనూన్యత భావంతో ఉన్న వారు ఒక్కసారి హెల్ప్‌లైన్ నంబర్ 14416కు కాల్ చేస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుంది.
– డాక్టర్ జీవన,
మానసిక వైద్యనిపుణురాలు, హిందూపురం


