టీడీపీ బూత్‌ కన్వీనర్‌ అరాచకం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ బూత్‌ కన్వీనర్‌ అరాచకం

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

2022లో మూడు సెంట్ల స్థలం కొనుగోలు

డబ్బులు చెల్లించడానికి ముప్పు తిప్పలు

నాలుగేళ్లుగా వృద్ధ దంపతులకు నరకం

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన దంపతులు

అనంతపురం సెంట్రల్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. అధికారం ఉంది కదా అని ధైర్యంతో సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా అనంతపురంలోని మూడో డివిజన్‌ టీడీపీ బూత్‌ కన్వీనర్‌ నాగరాజు దౌర్జన్యంపై బాధిత వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే... అనంతపురంలోని ఖాజా నగర్‌లో నివాసముంటున్న శోభ, నాగరాజు దంపతులకు గుత్తి రోడ్డు సమీపంలోని మయూరి హోటల్‌ వెనుక మూడు సెంట్ల స్థలం ఉంది. సంతానం లేకపోవడంతో కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న బంధువుల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని మూడు సెంట్ల స్థలాన్ని 2022లో టీడీపీ మూడో డివిజన్‌ నాయకుడు నాగరాజుకు రూ. 20 లక్షలకు విక్రయించారు. ఆ సమయంలో రూ.10 లక్షలు మాత్రమే నాగరాజు చెల్లించి, ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. మిగిలిన డబ్బు ఇవ్వకుండా రోజుల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో 80 ఏళ్లు పైబడిన వారు కాలం చేస్తే డబ్బు ఎగ్గొట్టవచ్చు అనే ఆలోచనతో అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓసారి తీవ్ర ఒత్తిడి చేయడంతో రూ. 10 లక్షలకు బాండ్‌ పేపర్‌ రాయించాడు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వృద్దులకు స్పందించడమే మానేశాడు. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి.. మీకు డబ్బులు ఇవ్వను అని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. దీంతో చేసేదేమి లేక బాధితులు శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావును ఆయన చాంబర్‌లో కలిశారు. అనంతరం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. నాగరాజు పెట్టిన మానసిక క్షోభ కారణంగా తన భర్తకు పక్షవాతం, గుండెపోటు వచ్చిందని వృద్దురాలు శోభ పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేయకుండా దుప్పటి పంచాయితీ చేసినట్లు తెలుస్తోంది.

కేఆర్‌ఆర్‌సీ పీడీసీ అఖిల బదిలీ

అనంతపురం అర్బన్‌: జిల్లాకు కేటాయించిన ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌ (పీడీసీ) అఖిలను ఆర్‌టీజీఎస్‌ డిప్యూటీ సెక్రటరీ గీతాంజలి శర్మకు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా అఖిల పనిచేస్తున్నారు. ఆన్‌ ఓడీ బేసిస్‌ కింద ఆమెను ఐఏఎస్‌ అధికారికి ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement