ఉరవకొండ: సంక్షేమ పాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది గురించి ప్రశ్నిస్తారన్న భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ ప్రజలను పెడదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఇదొక పాటలా మారిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ మంత్రి కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు, 1.35 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 10,032 విలేజ్ క్లినిక్‌లు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, నాడు–నేడు ద్వారా 15,715 ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడం, 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం, మూడు పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టుతో సహ 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, అమ్మ ఒడితో 26.067 మందికి లబ్ధి చేకూర్చడం విధ్వంసం ఎలా అవుతుందో కేశవ్ చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పాటు పేదలకు పక్కా గృహాలు, కోవిడ్ సంక్షోభంలోనూ వందశాతం సంక్షేమ ఫలాలు అందజేసి దేశంలోనే నంబర్ వన్ సీఎంగా వైఎస్ జగన్‌కు ఖ్యాతి దక్కిందన్నారు. వాస్తవానికి విధ్వంసం అనేది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మొదలైందన్నారు. అభివృద్ది పేరుతో వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్ది అమరావతి నిర్మాణం ముసుగులో దోపిడీ సాగిస్తున్నారని మండిపడ్డారు. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ5,500 కోట్లు ఎలా దోచి పెడతారంటూ నిలదీశారు. రూ.2,600 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారన్నారు. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలో చేపట్టకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. చంద్రబాబు పాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రజలకు బాగా అర్థమై, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని పేర్కొన్నారు.
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి


