సింహ వాహనంపై నృసింహుడు | - | Sakshi
Sakshi News home page

సింహ వాహనంపై నృసింహుడు

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

ఉరవకొండ రూరల్‌: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామిని వివిధ పుష్పాలతో అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. డప్పు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. స్వామివారిని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. కార్యక్రమానికి సురేంద్ర కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.

● బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. జల్లిపల్లికి చెందిన వెంకట రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్‌ బాబు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

పీటీసీ ప్రిన్సిపాల్‌గా సుప్రజ

అనంతపురం సెంట్రల్‌: పోలీసు ట్రైనింగ్‌ కళాశాల (పీటీసీ) ప్రిన్సిపాల్‌గా ఈ.సుప్రజ నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను అనంతపురం పీటీసీకి ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.2010లో పోలీసుశాఖలో డీఎస్పీగా నియమితులైన ఆమె గతంలో గుంతకల్లు డీఎస్పీగా పనిచేశారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొందారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

బెళుగుప్ప: మండలంలోని శ్రీరంగాపురంలోని అంబేడ్కర్‌ కాలనీలో నివాసముంటున్న తిమ్మరాజు, గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్‌(8) గ్రామ సమీపంలోని చెరువులోకి గురువారం ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఈత కొడుతూ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి నీట మునిగి పోయాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు అక్కడకు చేరుకుని గాలించి వెలికి తీసే లోపు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పెద్దవడుగూరు: పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తెలికి గ్రామంలో జరిగింది. వివరాలు... తెలికి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ సాంబశివుడు (48) గురువారం సాయంత్రం సమీప పొలాల వైపు తన గొర్రెలను మేపునకు తీసుకెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చెట్టు కిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే సాంబశివుడు మృతి చెందాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలాల్లో గాలించగా విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బీటెక్‌ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పరిధిలో బీటెక్‌ నాల్గో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌–20) రెగ్యులర్‌ ఫలితాలను ప్రిన్సిపాల్‌ పి.చెన్నారెడ్డి గురువారం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్‌ సెక్షన్‌లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.రామశేఖరరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ దిలీప్‌కుమార్‌, ప్రొఫెసర్‌ ఇన్‌చార్జ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కె.మాధవి, డాక్టర్‌ జరీనా, డాక్టర్‌ జయలక్ష్మి, హెచ్‌ఓడీలు ఆర్‌.రాజశేఖర్‌, కళ్యాణికుమార్‌, కె.కళ్యాణి రాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement