● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: ‘‘సంక్షేమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి. కార్పొరేషన్ల పరిధిలో రుణ రికవరీపై దృష్టి సారించండి. హెచ్‌పీటీఎస్ (హైజీన్, పోటబిలిటీ అండ్ టాయ్‌లెట్ శానిటేషన్) యాప్‌ను అధికారులు రోజూ మానిటర్ చేయాలి. ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. సంక్షేమ శాఖల పనితీరుపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లో మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలాఖరుకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవ్వాలన్నారు. నీటి సరఫరా లేకపోతే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి కొళాయి కనెక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో పనితీరు మెరుగుపర్చుకునేలా వార్డెన్లకు దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. ఏడాదికి సంబంధించి ప్రతి మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అందించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వంద శాతం యూడీఐడీ కార్డులను మే నెలాఖరుకు అందించాలని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో రూ.16 కోట్ల వరకు రుణాలు ఇచ్చారని, వాటి వసూలు వేగవంతం చేయాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో రుణాల రికవరీ లక్ష్యం నిర్దేశించుకుని వసూలుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పదో తరగతి ఫలితాలపై విశ్లేషించుకుని ఎందుకు వెనుకబడ్డామో కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని తిమ్మాపురం పాఠశాలను తనిఖీ చేయాలని, అక్కడ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా నిర్వహించారనేది పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారి ఖుష్బూ కొఠారి, డీపీఓ, ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈఓ నాగరాజునాయుడు, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శైలజ, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ కుముద, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రమణ్యం, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, జెడ్‌ఎస్‌డబ్ల్యూఓ గిరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


