అనంతపురం ఎడ్యుకేషన్: లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివితేనే మంచి ఫలితాలు వస్తాయనే భావనను చెరిపేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు తమ ప్రతిభతో సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ బడి పిల్లలు మెరిసిపోతూ ‘మేము కూడా తగ్గేదే లేదు’ అని నిరూపించారు. గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్‌ఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని రామగౌని హారిక 600లకు గానూ 592 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి టాప్‌లో నిలవగా... జిల్లాలో 19 మంది విద్యార్థులు 585, ఆపైన మార్కులు సాధించారు.
దారి చూపిన ‘మనబడి నాడు–నేడు’
గత కొన్నేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన మార్పులు ఈ ఫలితాలకు కారణమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, తాగునీరు, శౌచాలయాలు వంటి సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం లభించింది. విద్యార్థుల విజయంలో టీచర్ల పాత్ర కీలకం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనపు సమయం కేటాయించి, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫలితాలకు కారణమైంది. విజేతలలో చాలా మంది సామాన్య కుటుంబాలకు చెందినవారే. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం వారి పట్టుదలను తెలియజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని, సరైన మార్గదర్శనం చేస్తే ఎవరైనా విజయాన్ని సాధించగలరని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.


