అనంతపురం అర్బన్: రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఎన్నికలు గందరగోళం మధ్య ఆగిపోయాయి. ఏకగ్రీవంగా కమిటీ ఎన్నికవ్వాలే తప్ప ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించడం కుదరదనే దానిపై వివాదం రాజుకుంది. ఇదెక్కడి తీరంటూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులు తీవ్ర నిరసన తెలిపారు. కమిటీని తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పరిస్థితి రాష్ట్ర కమిటీ దృష్టికెళ్లడం.. అక్కడినుంచి వచ్చిన సూచనల మేరకు ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు.
ఏమి జరిగిందంటే...
కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో బుధవారం రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ వార్షిక సమావేశం నిర్వహించారు. 11 మంది మేనేజ్‌మెంట్ సభ్యుల నూతన కమిటీ ఎన్నికకు అవసరమైన ప్రక్రియను నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. ఎన్నికల అధికారిగా ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణా రెడ్డి వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కమిటీ నుంచి కె.జి.గోవిందరెడ్డి హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి చేపట్టారు. దీంతో నాలుగు ప్యానెళ్లు డాక్టర్ లక్ష్మణ ప్రసాద్, సుంకర రమేష్, ఎం.రాజ్‌కుమార్, ఎం.జి.వీరన్న ప్యానెళ్లు బరిలోకి దిగాయి. వీటితో పాటు వ్యక్తిగతంగా 20 మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు.
అభ్యంతరంతో వివాదం
రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజ్‌మెంట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే తప్ప ప్రత్యక్ష ఎన్నికలు జరపడం ఉండదంటూ ఎన్నికల అధికారికి కొందరు లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపారు. బరిలోకి దిగిన అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించారు. ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలన్నప్పుడు ఓటరు రిజిస్ట్రేషన్, నామినేషన్ తతంగం ఎందుకు అంటూ ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని రాష్ట్ర పరిశీలకుని ద్వారా రాష్ట్ర కమిటీ దృష్టికి ఎన్నికల అధికారి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు.
చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే..
రెడ్‌క్రాస్ సొసైటీని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు కొద్దిమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని పలువురు సభ్యులు విమర్శించారు. సమావేశం, ఎన్నికల గురించి సభ్యులందరికీ సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. సొసైటీలో మొత్తం 2,353 మంది సభ్యులు ఉంటే 167 మంది మాత్రమే సమావేశానికి హాజరవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈసారైనా ఇంత మంది వచ్చారని, గతంలో అయితే తమకు అనుకూలంగా ఉన్న 20 మంది లేదా 30 మందిని రప్పించుకోవడం.. ముందే నిర్ణయించుకున్న వ్యక్తులను సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం పరిపాటిగా ఉండేదని పలువురు విమర్శించారు. అయితే ఈసారి ఎన్నికల బరిలో నాలుగు ప్యానెళ్లతో పాటు మరో 20 మంది అభ్యర్థులు వేరుగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవ ఎన్నిక ఎత్తు పారలేదని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బరిలో నాలుగు ప్యానెళ్లు
వ్యక్తిగతంగా మరో 20 మంది నామినేషన్
ప్రక్రియపై కొందరు లఖితపూర్వ అభ్యంతరం
రాష్ట్ర కమిటీ సూచనలతో వాయిదా


