రెవెన్యూలో దళారుల దందా | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో దళారుల దందా

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

అనంతపురం అర్బన్‌: రెవెన్యూ శాఖలో అవినీతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలోని కొన్ని మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లోకి దిగువస్థాయి సిబ్బంది ‘పార్టీ’ల నుంచి డబ్బులు దండుకునేందుకు ప్రత్యేకంగా దళారులను ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చోట ముందుగా దళారులను ఆశ్రయిస్తేనే ఏ పనైనా జరుగుతుందనే ప్రచారం ఉంది. ప్రజలు, రైతులు తమ పనిమీద నేరుగా అధికారులను కలిసేందుకు ఇక్కడి అవినీతి సిబ్బంది అవకాశం ఇవ్వరని తెలిసింది. ఒకవేళ ఎవరైనా వెళ్లి అధికారిని కలిసి తమ సమస్య గురించి చెప్పుకున్నా.. ఇక్కడి అవినీతి సిబ్బంది తమపై అధికారికి ఏదో ఒకటి చెప్పి పనికాకుండా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. దీంతో చేసేది లేక పనుల కోసం వచ్చేవారు దళారులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే మండల స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

దళారుల రూటు సప‘రేటు’

వివిధ పనుల కోసం రెవెన్యూ కార్యాలయానికి వచ్చే వ్యక్తులు, రైతులను లక్ష్యంగా చేసుకుని దళారీల ద్వారా వసూళ్ల దందా సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పనిని బట్టి ‘రేటు’ నిర్ణయించి వసూలు చేస్తారని తెలిసింది. అందులోంచి దళారి తన వాటా సొమ్మును తీసుకుని మిగతాది తమకు అనుకూల ఉద్యోగికి ఇస్తారని సమాచారం. అయితే మరికొందరు దళారుల రేటు సప‘రేటు’గా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి. పనిచేసేందుకు తమ అనుకూల సిబ్బంది చెప్పిన మొత్తానికి మించి ‘పార్టీల’ నుంచి వసూలు చేస్తారని సమాచారం. సిబ్బందికి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతా మొత్తాన్ని ఈ దళారులు నొక్కేస్తారని తెలిసింది. పని కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ‘పార్టీ’ నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. దీంతో డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకు దళారులు అవినీతి సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.

భూ వివాదం ఫైలు క్లియర్‌ చేయిస్తానని యాడికి మండలం కంబాలపాడుకు చెందిన ఒక రైతు నుంచి మధ్యవర్తి ద్వారా ఒక ఉద్యోగి గతంలో రూ.30 వేలు వసూలు చేశాడు. పని కాకపోవడంతో డబ్బులు వెనక్కు ఇవ్వాలంటూ ఆ ఉద్యోగిపై మధ్యవర్తి ఒత్తిడి పెంచాడు. వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ఉద్యోగి డబ్బులను వెనక్కు చెల్లించాడు.

నార్పల మండలానికి చెందిన ఒక రైతు భూమి వివాదంలో ఉంది. రెవెన్యూ సిబ్బందికి అనుకూలంగా ఉన్న దళారి ఒకరు రైతు తరఫున రంగంలోకి దిగాడు. ఆర్డీఓ కోర్టులో రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని వీఆర్‌ఓ చెప్పడంతో రూ.లక్ష బేరం కుదుర్చుకున్నాడు. వీఆర్‌ఓ సూచించిన వీఏఓకు డబ్బులను దళారీ అందజేశాడు. అయితే ఆర్డీఓ కోర్టులో రైతుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో దళారి అడ్డం తిరిగాడు. తనకు రూ.లక్ష కాదు.. రూ.4 లక్షలు వెనక్కు ఇవ్వాలంటూ డబ్బులు తీసుకున్న సిబ్బందిపై ఒత్తిడి పెంచాడు. అంతే కాకుండా కలెక్టర్‌, ఎస్పీ, డీఆర్‌ఓకు ఆ దళారి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా రాష్ట్ర మంత్రి లోకేష్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కీలక పాత్రధారులుగా దిగువస్థాయి సిబ్బంది

అధికారులతో పనిచేయిస్తామని ముడుపులు

ఉన్నతాధికారుల వద్దకు ఫిర్యాదులు

Advertisement
 
Advertisement
Advertisement