● రూ.25 లక్షలకు పైగా నష్టం
గుత్తి రూరల్: మండలంలోని ఊటకల్లు, ఊబిచెర్ల, గ్రామాల్లో మంగళవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు ఏక బిగిన భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రైతులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు గ్రామాల్లోనూ సుమారు 125 ఎకరాల్లో 10 నుంచి 12 సంవత్సరాల వయస్సున్న చెట్లకు కాసిన మామిడి కాయలు నేలరాలాయి. కాపు చేతికొచ్చే సమయం కావడం, ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను మామిడి ధర రూ.40వేలు ఉండటంతో ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించిన తమను గాలి, వాన రూపంలో కోలుకోలేని దెబ్బ తీసిందని ఊటకల్లు రైతులు బాలన్న, శ్రీరాములు, చంద్రశేఖర్‌రెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి, నాగరాజు, ఊబిచెర్ల రైతు లక్కిరెడ్డి శేఖర్ వాపోయారు. నేలరాలిన మామిడికాయల ధర టన్ను రూ.10 వేలకు మించి పోదని, దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. మండల వ్యాప్తంగా భారీ గాలులకు మామిడికాయలు నేలరాలి రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


