ఏసీబీ వలలో వీఆర్వో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్వో

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

ఏసీబీకి చిక్కిన వీఆర్వో రామకృష్ణ, తహసీల్దార్‌ సోమశేఖర్‌ను విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు

తాడిపత్రి టౌన్‌: తాడిపత్రి మండలం ఆవులతిప్పాయిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కాడు. రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆవులతిప్పాయిపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగుస్తున్నాడు. ఇతనికి స్వగ్రామమైన ఆవుల తిప్పాయిపల్లిలో సర్వే నంబర్‌ 37లో వారసత్వంగా సంక్రమించిన 87 సెంట్ల భూమి ఉంది. దీన్ని అండగల్‌లో మిగులు భూమిగా చూపడంతో సరిచేయాలని ఐదు నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో రామకృష్ణను సంప్రదించగా.. రూ.లక్ష లంచం ఇస్తేనే సరిచేస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని ప్రభాకర్‌రెడ్డి చెప్పగా.. చివరకు రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ మొత్తం కూడా ఇవ్వడం ఇష్టలేని రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వీఆర్వోను వలపన్ని పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా బుధవారం తాడిపత్రి పట్టణ శివారులోని కడపరోడ్డులో ఉన్న ఓ టీ కేఫ్‌లో రైతు ప్రభాకర్‌రెడ్డి రూ.30 వేల నగదును వీఆర్వోకు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ హమీద్‌ఖాన్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేశారు. తహసీల్దార్‌ సోమశేఖర్‌ను సైతం విచారించారు.

Advertisement
 
Advertisement
Advertisement