సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్‌ అవయవ దానం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్‌ అవయవ దానం

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

రొద్దం: జిల్లాలో సచివాలయ ఉద్యోగి కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన శ్రీనివాసులు అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే.. రొద్దం గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు (40)కు భార్య అనిత, ఆరేళ్లు, నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ముగ్గురు కుమారులు ఉన్నారు. కలిపి గ్రామ సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25న ఇంటి పట్టున ఉండగా తనకు తెలిసిన వారి ఇంట్లో విద్యుత్‌ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడడంతో తొలుత పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. బుధవారం శ్రీనివాసులు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు డాక్టర్లు తెలిపారు. అలాగే అవయవదానంపై వారికి అవగాహన కల్పించడంతో అంత వేదనలోనూ వారు అంగీకరించారు. దీంతో ఆస్పత్రి వైద్యులు ‘జీవన్‌దాన్‌’కు దరఖాస్తు చేసి, వెంటనే శ్రీనివాసులు దేహం నుంచి కాలేయం, మూత్రపిండాలను సేకరించి వాటిని అవసరమైన రోగులకు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement