రాప్తాడు రూరల్: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కొత్తవారిపల్లి గ్రామానికి చెందిన బి.భాస్కర్‌రెడ్డి (32) కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా పొట్టోళ్లపల్లిలో నివాశముంటూ లారీ డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కేఏ40బీ 7198 నంబర్ గల లారీలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గ్రానైట్ లోడుతో బయలుదేరిన భాస్కరరెడ్డి బుధవారం తెల్లవారుజామున రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ప్రమాదతీవ్రతకు గ్రానైట్ బలంగా క్యాబిన్‌ను తాకడంతో క్యాబిన్ ఛిద్రమైంది. డ్రైవరు భాస్కరరెడ్డి అందులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మృతదేహన్ని వెలికి తీసి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా నిద్రమత్తు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


