● నగర పాలక సంస్థ అధికారుల విచారణలో వెల్లడి
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో కొందరు కాంట్రాక్టర్లు ఫేక్ సర్టిఫికెట్లతో రూ.కోట్లలో పనులు చేసి, బిల్లులు పొందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన అధికారులు లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించడంతో అవి ఫోర్జరీ సంతకాలతో సృష్టించినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం అక్రమాలకు ఆద్యుడు నగర పాలక సంస్థలోని కంప్యూటర్ ఆపరేటర్ పరుశురామ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లుగా అనుమతులు పొందేందుకు అవసరమైన ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంతకాలు చేయించి ఇస్తానంటూ పరుశురామ్ కొందరితో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని తానే ఎస్‌ఐ సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రీన్ ఇంక్‌తో కాకుండా బ్లూ ఇంక్‌తో చేసిన సంతకాలను పరిశీలన సమయంలోనూ అధికారులు పసిగట్టలేకపోయారు. దీంతో రెండేళ్లుగా వారందరూ కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ వచ్చారు. రూ. కోట్లలో పనులు చేసి, బిల్లులు కూడా చేసుకున్నారు. అక్రమాలు నిర్ధారణ కావడంతో పరుశురామ్‌పై అనంతపురం రెండో పట్టణ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు కూడా పరుశురామ్‌పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
బండిశుల తిరునాల ప్రారంభం
పామిడి: మండలంలోని రామరాజుపల్లి గ్రామంలో వెలిసిన సుంకులమ్మ, ముత్యాలయ్య ఆలయం ఉత్సవాల్లో భాగంగా బండిశుల తిరునాల బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం చిలకమ్మ పల్లకీలో గ్రామదేవతల ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం బండిశుల (రథం)పై అధిష్టింపజేసి గుత్తిఅనంతపురం గ్రామం వైపుగా ఏడు గాన్ల ఎద్దులతో రథాన్ని లాగించారు. బుధవారం రాత్రికి గుత్తిఅనంతపురం గ్రామంలోని ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసిన అనంతరం గురువారం రాత్రి రామరాజుపల్లికి రథాన్ని చేరుస్తారు. తిరిగి శుక్రవారం రాత్రికి బయలుదేరి శనివారం తెల్లవారుజామున గుత్తిఅనంతపురానికి, శనివారం రాత్రి అక్కడ నుంచి బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున రామరాజుపల్లికి చేరడంతో ఈ తిరునాల ముగుస్తుంది.


