● బురిడీ కొట్టించేందుకు తండ్రీకొడుకు యత్నం
● ఫోర్జరీ కేసులో అరెస్టు
తనకల్లు: ‘చాట్ జీపీటీ’ ఏఐ టూల్ ద్వారా నకిలీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ రూపొందించి మోసం చేయడానికి ప్రయత్నించిన తండ్రీకొడుకును పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి రూరల్ సీఐ నాగేంద్రతో కలిసి స్థానిక రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తనకల్లు మండలం చీకటిమానిపల్లికి చెందిన జయచంద్ర భార్య రమణమ్మ కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. తన భార్య కడప నుంచి చీకటిమానిపల్లికి వచ్చివెళ్లడం కష్టంగా ఉందని జయచంద్ర కదిరి మండలం కౌలేపల్లికి చెందిన తన బంధువు పలక గంగాద్రితో చెప్పాడు. దీంతో గంగాద్రి తన కుమారుడైన వేణు ఇద్దరూ కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వద్ద శేషాద్రి అనే వ్యక్తి పీఏగా ఉన్నాడని, అతని ద్వారా నీ భార్యకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేయిస్తామని జయచంద్రతో నమ్మబలికారు. ఇందుకు రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పారు. వారి మాటలను నమ్మిన జయచంద్ర రూ.లక్ష అందజేశాడు. అనంతరం జయచంద్ర ద్వారా అతని భార్య రమణమ్మ పూర్తి వివరాలను సేకరించిన వేణు.. తన సెల్‌ఫోన్‌లో చాట్ జీపీటీ ఏఐ టూల్‌ను ఉపయోగించి ఒరిజనల్ సర్టిఫికెట్ మాదిరే మంత్రి డిజిటల్ సంతకంతో కూడిన ఫేక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీని తయారు చేశాడు. దాన్ని వాట్సాప్‌లో జయచంద్రకు పంపించాడు. అనుమానం వచ్చిన జయచంద్ర మంత్రి పీఏగా శేషాద్రి అనే వ్యక్తి ఉన్నాడా, లేదా అని ఆరా తీశాడు. అయితే మంత్రి సత్యకుమార్ వద్ద శేషాద్రి అనే వ్యక్తి ఎవరూ పీఏగా లేరని తెలుసుకున్న జయచంద్ర తాను మోసపోయినట్లు గ్రహించి తనకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.


