గుంతకల్లు డివిజన్‌కు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

గుంతకల్లు డివిజన్‌కు అన్యాయం

Apr 30 2026 7:49 AM | Updated on Apr 30 2026 7:49 AM

ఎస్‌సీఆర్‌ఎంయూ జోనల్‌ ప్రధాన కార్యదర్శి శంకర్రావు

గుంతకల్లు: దశాబ్దాలుగా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు అన్యాయం జరుగుతూనే ఉందని దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక రైల్వే గ్రౌండ్‌ సమీపంలోని మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పడుతున్న తరుణంలో తాజాగా గుంతకల్లు డివిజన్‌కు మరోసారి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో రాయచూరు సెక్షన్‌ను గుంతకల్లు డివిజన్‌ నుంచి తప్పించి దక్షిణ మధ్య రైల్వేలోనే కొనసాగించడం సబబు కాదన్నారు. గుంతకల్లు నుంచి విశాఖపట్నంకు హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. రైల్వే ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా విజయవాడలో రైల్వే సెంట్రల్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలను స్థానిక నిరుద్యోగులకు కేటాయించేలా రాజ్యాంగ సవరణ చేయడానికి కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించాలన్నారు. డివిజన్‌లోని ఏదో ఒక కేంద్రంలో రిక్రూట్‌మెంట్‌ బోర్డును నియమించాలన్నారు. రైల్వే డీజిల్‌ షెడ్డులన్నీ ఎలక్ట్రికల్‌ షెడ్లుగా మారుతున్న తరుణంలో డీజిల్‌ షెడ్‌ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వందే భారత్‌, హంసఫర్‌ తదితర హైస్పీడ్‌ రైళ్ల లోకో పైలెట్లకు జీతాలు పెంచాలన్నారు. సమావేశంలో మజ్దూర్‌ యూనియన్‌ గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.విజయ్‌కుమార్‌, కోశాధికారి శ్రీనివాసశర్మ, స్టేషన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి జాఫర్‌ఖాన్‌, పెన్షనర్ల అసోసియేషన్‌ గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement